క్లైమాక్స్‌లో అసలు సిసలు మజా.!

Monday, June 24th, 2013, 01:57:26 PM IST


ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ ను నెగ్గింది. ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ను ఖంగుతినిపించి అద్భుత విజయం సాధించింది. వరుణుడు అడుగడుగునా అడ్డు తగిలినా టీమిండియానే ఛాంపియన్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచేదే. కానీ క్లైమాక్స్ లో మిస్టర్ సుడిగాడు ధోనీ వైపే మ్యాచ్ మొగ్గు చూపింది. అయితే ఈ మ్యాచ్ లో అసలు మజా క్లైమాక్స్ సీన్ ఇచ్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 129 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఎదుట 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ ఆదిలోనే కుక్ వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత బెల్, ట్రాట్, రూట్ లు వెనుదిరిగినా.. భారత శిబిరంలో ఆనందం కనిపించలేదు. 46 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను బొపారా.. మోర్గాన్ లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 64 పరుగులు జోడించారు. బౌండరీలతో రెచ్చిపోయి.. టీమిండియాలో గుబులు రేపారు.

ఇక మ్యాచ్ లో అసలు సిసలు ఉత్కంఠ, ఎంటర్ టైన్మెంట్ మొదలైంది. 17వ ఓవర్ ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 102 పరుగులు. చివరి మూడు ఓవర్లలో అంటే 18 బంతుల్లో 28 పరుగులు చేయాలి. మ్యాచ్ ఇరుజట్లనూ ఊరించిది. ఈ దశలో ఇషాంత్ శర్మ బౌలింగ్ వేశాడు…సూపర్ టచ్ లో ఉన్న మోర్గాన్ ఇషాంత్ వేసిన రెండో బంతికి సిక్సర్ బాదాడు. ఒత్తిడికి గురైన ఇషాంత్ ఆ తర్వాత రెండు బంతులను వైడ్లుగా వేశాడు. దీంతో రన్ ఈక్వేషన్ మారిపోయింది. ఇంగ్లండ్ విజయానికి 15 బంతుల్లో 20 రన్స్ చేయాలి.

సిక్సర్ బాది ఊపుమీదున్న మోర్గాన్.. ఇషాంత్ వేసిన బంతికి అనుహ్యంగా అవుటయ్యాడు. భారీ షాట్ కొట్టబోయి షార్ట్ మిడ్ వికెట్ లో ఉన్న అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు ప్రమాదకర బ్యాట్స్ మెన్ బొపారాను కూడా ఆ తర్వాతి బంతికి అవుటయ్యాడు. ఇషాంత్ వేసిన బౌన్సర్ ను భారీ షాట్ కొట్టబోయి స్క్వేర్ లెగ్ లో ఉన్న అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇషాంత్ డబుల్ ధమాకా సాధించడంతో మ్యాచ్ ఒక్కసారిగా టీమిండియాల చేతిలోకి వచ్చింది.

12 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన దశలో బట్లర్ క్రీజులో ఉన్నాడు. ఈ దశలో బౌలింగ్ కు దిగిన జడేజా అద్బుతమైన బంతితో బట్లర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి వరుస బ్యాట్స్ మెన్లలో బట్లర్ చెప్పుకోదగ్గ ఆటగాడు.. అవుటవడంతో ధోనీ రిలాక్సయ్యాడు.

ఐతే ఇంగ్లండ్ మాత్రం పోరాటపటిమ కొనసాగించింది. 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో అశ్విన్ బౌలింగ్ వేశాడు. ఇతడు వేసిన రెండో బంతిని స్టువర్ట్ బాడ్ ఫోర్ గా మలిచి టెన్షన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మూడు బంతులకు 5 పరుగులిచ్చాడు. ఇక చివరి బాల్ కు సిక్సర్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైంలో అభిమానుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. క్రీజులో ఉన్న ట్రెడ్ వెల్ ఎక్కడ సిక్సర్ కొడతాడో అని అంతా కంగారుపడ్డారు. ఐతే ఫాంలో ఉన్న అశ్విన్ చివరి బంతికి పరుగులేమి ఇవ్వలేదు. ఒక్కసారిగా టీమిండియా శిబిరంలో ఆనందం.. గ్రౌండ్ లో కేరింతలు.. చివరి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచింది.! మరోసారి తాము ‘ఛాంపియన్స్’ అంటూ నిరూపించింది!!