టాప్ స్టోరి : చైనా బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర‌?

Friday, March 9th, 2018, 09:50:57 PM IST

టాలీవుడ్‌కి అమెరికా మ‌రో నైజాం మార్కెట్‌గా మారుతున్న‌ట్టు.. చైనా మార్కెట్‌ భార‌తీయ సినిమాకి డాల‌ర్ల‌(ఎన్ క‌రెన్సీ) క‌ల‌శంగా మారుతున్న‌ట్టు ఏనాడైనా క‌ల‌గ‌న్నామా? క‌ల‌గ‌న‌నిది జ‌రిగితే దానినే విధి అంటారు! ఆ విధి భార‌తీయ సినిమా త‌ల‌రాత మార్చేయ‌బోతోందని అర్థ‌మ‌వుతోంది. అందునా బాలీవుడ్‌ని టిప్ప‌ర్ లారీలా ఢీకొడుతున్న‌ తెలుగు సినిమాకి ఇది ఆలంబ‌న‌గా మారి వేల కోట్ల బిజినెస్‌కి చుక్కానీలా ఉప‌యోగ‌ప‌డ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ చైనా బాక్సాఫీస్ వ‌ద్ద సాధించిన విజ‌యాల్ని స్ఫూర్తిగా తీసుకుని స‌ల్మాన్ ఖాన్ న‌టించిన `భ‌జ‌రంగి భాయిజాన్‌`ని రిలీజ్ చేశారు. మ‌న సినిమాల్లో మ్యాట‌ర్ ఉంద‌న్న న‌మ్మ‌కం చైనీయుల్లో బ‌లంగా పాదుకొల్ప‌డంలో అమీర్‌ సినిమాలు ఇతోధికంగా దోహ‌దం చేశాయి. ఈ ప‌రిణామం స‌ల్మాన్‌కి క‌లిసొచ్చింది. అందుకే నేరుగా చైనా మార్కెట్లో త‌న సినిమాని రిలీజ్ చేశాడు. భాయిజాన్ ఇప్ప‌టికే 120 కోట్ల నెట్ వ‌సూళ్లు అందుకున్నాడు చైనా మార్కెట్లో. ప్ర‌స్తుత `ఎన్‌` క‌రెన్సీని రూపాయ‌ల్లోకి మార్చుకునే ప‌నిలో ఉన్నాడు. ఈ ప‌రిణామం ఇలా ఉండ‌గానే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఇర్ఫాన్ ఖాన్ న‌టించిన `హిందీ మీడియం` అక్క‌డ రిలీజ‌వుతోంది. యూనివ‌ర్శ‌ల్ అప్పీల్‌, యూనిక్ కంటెంట్ ఉంటే ఏ దేశంలోనైనా మ‌న సినిమాల్ని రిలీజ్ చేసుకోవ‌చ్చు అని నిరూపిస్తూ హిందీ మీడియం ఏప్రిల్ 4న అక్క‌డ రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ ప‌రిణామాల‌న్నీ ఇండియ‌న్ సినిమా భ‌విష్య‌త్ రూపురేఖ‌ల్ని మార్చేయ‌బోతున్నాయ‌నే చెప్పాలి. మ‌న మార్కెట్ విస్త్ర‌తి చైనాలోనూ పెరిగింది. జ‌నాభాలో ప్ర‌పంచ దేశాల్లో నంబ‌ర్ వ‌న్‌గా రాజ్య‌మేలుతున్న డ్రాగ‌న్ కంట్రీ నుంచి క‌రెన్సీ మూట‌ల్ని ఇండియాకి తెచ్చుకోవ‌డం వీజీ అని మ‌న మేక‌ర్స్ గ్ర‌హించారు. అందుకే ఇప్పుడు `బాహుబ‌లి-2` చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చైనాలో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. త‌దుప‌రి రిలీజయ్యే క్రేజీ సినిమా మ‌రో తెలుగు సినిమా. ద‌టీజ్‌ `సైరా-న‌ర‌సింహారెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి – రామ్‌చ‌ర‌ణ్ – సురేంద‌ర్ రెడ్డి బృందం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ఈ చిత్రాన్ని చైనాలో స‌క్సెస్ చేయాల‌నుకుంటున్నార‌ని తెలుస్తోంది. యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ ఏదైనా డిసైడ్ చేస్తుంది. అందులో ఏమాత్రం త‌గ్గ‌కుండా గొప్ప క‌థ‌, కంటెంట్‌తో ఈ సినిమాని తీస్తే మ‌నం కూడా ఓ దంగ‌ల్‌, సీక్రెట్ సూప‌ర్‌స్టార్ సాధించిన వ‌సూళ్ల‌ను ద‌క్కించుకోగ‌లం. మ‌న సినిమాల రేంజును 2000 కోట్లు దాటించాయి బాహుబ‌లి, దంగ‌ల్‌. ఇప్పుడు వాటిని మించిన సినిమాలు రావాల్సి ఉందింకా. చూద్దాం.. అస‌లేం జ‌ర‌గ‌బోతోందో?