‘ప్రత్యేక ప్యాకేజ్’ పై 1800 ఈ – మెయిల్స్ వచ్చాయన్న ఇన్ఫోసిస్ మూర్తి..!!

Friday, February 10th, 2017, 03:27:06 PM IST


ఇండియాలోని ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్ లో లుకలుకలు స్పష్టంగా బయటపడ్డాయి. సంస్థలో జరుగుతున్నా పరిణామాలపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, తొలి చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. ఇన్ఫోసిస్ లో సంక్షోభం నెలకొన్న మాట వాస్తవమే అని ఆయన అన్నారు.అయితే ఈ సమస్య సీఈఓ విశాల్ సిక్కతో కాదని బోర్డు లో పారదర్సకత ప్రమాణాలు కొరవడయని ఆయన అన్నారు. కంపెనీలో గవర్నెన్స్ దారుణంగా ఉందని ఆయన అన్నారు. కంపెనీలో డేవిడ్ కెన్నెడీ , సి ఎఫ్ ఓ బన్సాల్ ల సెవెరెన్స్ ప్యాకేజీ లపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసారు.

బన్సాల్ కు సాధారణ ప్యాకేజ్ కంటే 10 రెట్లు అదనంగా చెల్లించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే సమయంలో రెమ్యునరేషన్ కమిటీ చైర్మన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆమోదించాల్సి ఉందని అన్నారు. అలా చేయకుండా ప్రత్యేక ప్యాకేజ్ లను ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. నిబంధనలతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్యాకేజ్ లను ఇస్తే సాధారణ ఉద్యోగులలోకి ఎలాంటి సంకేతాలు వెళతాయని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం పై తనకు ఇప్పటికే 1800 ఈ – మెయిల్స్ వచ్చాయని, కింది స్థాయి ఉద్యోగులంతా దీనిపై అసంతృప్తిగా ఉన్నారని అయన అన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ కొన్ని దశాబ్దాల కృషికి ఫలితమని కానీ తాజా పరిణామాలు తీవ్రంగా భాదిస్తున్నాయని అన్నారు.