చిన్నతప్పులున్నా క్షమించం : హెచ్1బి వీసదారులకు యూఎస్‌సీఐఎస్‌ హుకుం

Monday, April 2nd, 2018, 05:00:06 PM IST

అమెరికా వెళ్లి అక్కడ చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మంచి పేరు, అలానే సంపాదన పొందవచ్చని కలలుగనేవారి ఆశలకు రోజు రోజుకి ట్రంప్ ప్రభుత్వం గండికొట్టే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది. కేవలం అక్కడివారికి మాత్రమే ప్రధమంగా ఉపాధి, ఉద్యోగాల కల్పన అనే ధ్యేయంతో ట్రంప్ ఈ విధమైన చర్యలకు దిగుతున్నారని, పలు దేశాలు విమర్శిస్తున్నాయి. నిజానికి ఆయన మన జాతి, మన పౌరులే ముఖ్యం అనే నినాదంతోనే గెలిచారనే విమర్శ కూడా ఉందనే వుంది. విషయం లోకి వెళితే, చిన్న చిన్న తప్పులను కూడా ఉపేక్షించబోమని అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) హెచ్1బి వీసా దారులకు హెచ్చరిస్తోంది.

ప్రత్యేక వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ సిబ్బందిని అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి హెచ్‌1బీ వీసా వీలు కల్పిస్తుంది. భారత్‌, చైనా వంటి దేశాలకు చెందిన వేల మంది ఉద్యోగులను ఈ వీసాల కింద సాంకేతిక పరిజ్ఞాన కంపెనీలు నియమించుకుంటున్నాయి. హెచ్‌1బి వీసా దరఖాస్తులను దాఖలు చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుండడంతో మునుపెన్నడూ లేనంతగా ట్రంప్‌ ప్రభుత్వం ఈ దరఖాస్తులను శల్యపరీక్ష చేయనున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏటా 65వేల వీసాలకు మించి ఇవ్వకూడదన్న పరిమితి ఉంది. లాటరీ ద్వారా ఎంపిక కావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని భావిస్తూ ఆయా సంస్థలు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడం పరిపాటిగా వస్తోంది.

ఇలా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే తిరస్కరణ తప్పదని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేస్తోంది. దరఖాస్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పాటు దరఖాస్తుల నిశిత పరిశీలనకు ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్న యూఎస్‌సీఐఎస్‌, ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దరఖాస్తులోని అన్ని అంశాలను సరిగ్గా పూర్తి చేయాలని, లబ్ధిదారుకు చెందిన చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ప్రతిని కూడా జతపర్చాలని దరఖాస్తు చేసే కంపెనీలకు సూచించింది. అయితే భారత కంపెనీలు సమర్పించే దరఖాస్తులను మరింత సునిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఇతర దేశాల వారి కన్నా భారత కంపెనీలు వీసా రుసుము ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. సగటున ఒక్కో దరఖాస్తుకు ఆరువేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు సంబంధించిన వీసాల ప్రక్రియలో అవకతవకలను నివారించి అమెరికా సిబ్బంది ప్రయోజనాలను కాపాడడమే తమకు ముఖ్యమని యూఎస్‌సీఐఎస్‌ స్పష్టం చేసింది. అందుకే ఎంతో కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని అధికారులుచెపుతున్నారు. అయితే ఇటువంటివి ట్రంప్ నిరంకుశపాలనకు సాక్ష్యాలని పలుదేశాలకు చెందిన నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు……