యువి క్రియేషన్స్ ఖాతాలో రెండవ ఫ్లాప్ పడ్డట్లేనా….?

Sunday, July 29th, 2018, 07:48:25 PM IST

మిర్చి చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్, ఆ చిత్రం తోనే సూపర్ హిట్ కొట్టింది. ఇక ఆ తరువాత అప్పటినుండి మొన్నటివరకు కూడా వారి బ్యానర్ లో వచ్చిన రన్ రాజా రన్, భలే భలే మగాడివోయ్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, భాగమతీ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఆ సంస్థ అనతి కాలంలోనే టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థల్లోనే ఒకటిగా నిలిచి మంచి పేరు సంపాదించింది అని చెప్పవచ్చు. అయితే ఆ బ్యానర్ నుండి గోపి చంద్ మరియు రాశి ఖన్నాల కలయికలో వచ్చిన జిల్ సినిమా వారికీ తొలి ఫ్లాప్ గా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వారి బ్యానర్ నుండి వచ్చిన హ్యాపీ వెడ్డింగ్ కూడా మరొక ఫ్లాప్ గా మిగిలే అవకాశం వుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పెద్ద బ్యానర్ కావడంతో చిత్రం పై అంచనాలు పెరిగినప్పటికీ, నిన్న విడుదలయిన దగ్గరినుండి సినిమాలో ఊహించినంత కంటెంట్ లేదని, ఇక హీరో సుమంత్ అశ్విన్ ఖాతాలో మరొక ప్లాప్ పడినట్లే అని అంటున్నారు.

ఇక తొలి చిత్రం ఒక మనసుతో హిట్ కొట్టి సినీ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న కొణిదెల వారి అమ్మాయి నిహారిక ఆ చిత్రం ఘోర పరాజయం అందుకోవడంతో, ఇక తదుపరి చేయబోయే చిత్రం మాత్రం మంచి విజయం అందుకోవాలని జాగ్రత్త పడి, ఈ చిత్రాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ చిత్రం కూడా చివరకు ఫ్లాప్ గా నిలిచే అవకాశం కనపడడంతో నిహారిక ఆశలు అడియాసలయ్యాయని అంటున్నారు. సినిమాలో హీరో హీరోయిన్ లు ఇద్దరి జోడి బాగున్నప్పటికీ కూడా బలంలేని కథ, కథనాలు మరియు సాగతీత స్క్రీన్ ప్లే, ఆకట్టుకోలేని దర్శకత్వ ప్రతిభ వెరసి హ్యాపీ వెడ్డింగ్ చిత్రాన్ని ప్లాప్ చిత్రాల సరసన చేరేటట్లు చేసిందని అంటున్నారు. అయితే ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంతమేరకు కలెక్ట్ చేస్తుందో, కొన్నవారికి ఎంత తెచ్చిపెడుతుందో అనేది కొన్నాళ్ళు వేచి చూస్తే కానీ చెప్పలేం….

  •  
  •  
  •  
  •  

Comments