విశ్లేషణ : ముదురుతున్న “ఆంగ్ల” వివాదం–జగన్ ఈ విషయం లో తప్పు చేశాడా?

Tuesday, November 12th, 2019, 12:52:23 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సంకల్పించారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో జగన్ పాదయాత్రలో పేద ప్రజలను, గ్రామీణ ప్రాంత వాసులను దగ్గర నుండి చూడటం తో వారి కష్టాలు, ఎదగలేకుండా ఉండటానికి గల కారణాల్ని తెలుసుకున్నారు. ఉన్నతమైన విద్య ద్వారా మాత్రమే వీరి జీవితాలు మార్చవచ్చు అనుకోని, ఆనాడే ప్రజలకు హామీ ఇచ్చారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి.

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగం లో, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడం, రివర్స్ ప్రాజెక్ట్ టెండరింగ్ ల విధానం తో ప్రభుత్వానికి డబ్బు ఆదా అయ్యేలా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రతి పక్ష పార్టీలకు కొన్ని సార్లు అవకాశం ఇచ్చినట్లు అయింది. అందులో ఇసుక కొరత, పవర్ కట్. మరికొన్ని సంక్షేమ పథకాలు, ఆంగ్ల మాధ్యమం విధానం.

జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాల సృష్టీకరణ జరగాలన్న, విద్యారంగం లో ప్రమాణాలు మారాలన్న అది ఇంగ్లీష్ మీడియం ద్వారా మాత్రమే సాధ్యం అని భావించారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీనికి సంబందించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉన్నత విద్యని ప్రభుత్వ పాఠశాలల్లో అందించేట్లుగా ఇంగ్లీష్ మీడియం లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఒక జీవో ని విడుదల చేసారు. అయితే దీనిని మొదట కొన్ని విడతలుగా అమలు చేయాలనీ భావించారు. మొదటి విడతగా 1 నుండి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఆ తరువాత ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క తరగతి లో ఇంగ్లీష్ మీడియం ని చేస్తూ ఉండటం.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతి పక్ష పార్టీలైన తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ లు తీవ్ర వ్యతిరేకతని వ్యక్త పరిచాయి. అయితే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయం లో కొన్ని ప్రత్యేక శిక్షణ తరగతుల ద్వారా ఇంగ్లీష్ మీడియం పై పట్టు వచ్చేలా కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ఆ విషయంలో అపుడు ప్రతి పక్షం లో వున్న జగన్ మోహన్ రెడ్డి దీనిని తప్పు బట్టారు. అయితే అప్పట్లో తప్పుబట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇపుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల అసలు కారణం, అసలు విషయం వేరే ఎదో దాగి ఉందని కొందరు అభిప్రాయం పడుతున్నారు.

అయితే జగన్ పై వస్తున్న విమర్శలకు జగన్ స్పందించారు. చంద్రబాబు కుటుంబం లోని కొడుకు, మనవడు ఏ మాధ్యమం లో చదువుతున్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కి వున్న ముగ్గురు భార్యల నలుగురు పిల్లలు ఏ మాధ్యమం లో చదువుతున్నారు అని అడిగారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఒక పక్క జనసేన సమస్యల పై పోరాడుతుందని, ఇలా పక్కదోవ పట్టించడానికే జగన్ ఈ వ్యాఖ్యలు చేసారని, అందరూ సంయమనం పాటించాలని జనసేన నేతలు అన్నారు.

అయితే తెలుగు భాష కి ప్రాముఖ్యం, ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగ విషయాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టినా, పిల్లలు వున్న వాతావరణం లో ఇంగ్లీష్ మాధ్యమం చేస్తే డ్రాప్ అవుట్ లు ఎక్కువగా వుంటాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తెలుగు ని పూర్తిగా తీసేసి, ఇలా ఇంగ్లీష్ మాధ్యమాన్ని పెట్టడం తో విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని చాల మంది విద్యావేత్తలు భావిస్తున్నారు.

ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్ మీద సరైన పట్టు లేకనే ఉద్యోగాలు పొందలేకపోతున్నాం అని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. అయితే వ్యాపార స్థాయిలో రాణించాలన్న ప్రస్తుత ఆధునీకరణ ప్రపంచం లో బ్రతకాలన్నా ఆంగ్లం అవసరం. అయితే జగన్ నిర్ణయాన్ని ఒక పక్క సమర్దిస్తున్నా తెలుగు భాష ప్రేమికులు సొంత బాషాని కాపాడుకోవాలంటే పాఠాలు తెలుగులోనే బోధించాలి అని చెబుతున్నారు. అయితే ఎన్నోలక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సదుపాయం సరిగా లేక ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

అయితే సరైన సన్నద్ధత లేకుండా ఈ నిర్ణయాలు బెడిసికొడతాయి అని పలువురు విశ్వసిస్తున్నారు. సరైన ప్రణాళిక తో పాటుగా ఆంగ్లాన్ని బోధించేవాళ్ళు రాష్ట్రం లో ఎంతమంది వున్నారు? మిగతా సబీజెక్టుల లాగా కాకుండా ఇంగ్లీష్ అనేది ఒక బాషా, దీని పై పట్టు సాధిస్తూ మన తెలుగు బాషాని కూడా కాపాడుకోవాలనేది అందరి అభిప్రాయం. మరి ఈ విషయం లో జగన్ నిర్ణయం సరైనదేనా?