వర్మ దెబ్బకు భయపడుతున్న హీరోలు?

Monday, June 4th, 2018, 02:16:06 PM IST

సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ పేరు తెలియని వారుండరు. ఒకప్పుడు అయన రూపొందించిన చిత్రాలు పెద్ద ట్రెండ్ సెట్టర్లు గా నిలిచేవి. టాలీవుడ్ లో కూడా వర్మ తనదైన ముద్ర వేశారు. శివ, సత్య, క్షణ క్షణం, మనీ వంటి చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభని అద్భుతంగా నిరూపించుకున్నారు. అయితే గత కోన్నేళ్ళుగా అయన ప్రాభవం రాను రాను తగ్గుముఖం పట్టింది. కాగా ప్రస్తుతం వర్మ సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులు భయపడే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆయన తీసిన చిత్రాలలో ‘రక్త చరిత్ర’ చిత్రం కాస్త పర్వాలేదనిపించింది. ఇక మిగిలినవన్నీ ఘోర పరాజయాలు అందుకున్నాయి. వర్మకు ఎన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ ఆయన దర్శకత్వ ప్రతిభ మీద నమ్మకంతో నాగార్జున ఆయనకు ఆఫీసర్ రూపంలో మళ్లి ఒక అవకాశం ఇచ్చారు.

అయితే ఆ అవకాశాన్ని ఏమాత్రం వినియోగించుకోని వర్మ మరొక ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీనితో వర్మతో చిత్రాలు చేయడానికి హీరోలు భయపడుతున్నారని, ముఖ్యంగా పెద్ద హీరోలైతే ఆయనకు మరింత దూరంగా వ్యవహరిస్తున్నట్లు టాక్. ఒకప్పుడు వర్మ చిత్రాల్లో సహజత్వం, టేకింగ్ బాగుండేవి కానీ ఇప్పుడు సమకాలీన అంశాలపై ఆయన తీస్తున్న చిత్రాలలో సగటు ప్రేక్షకుడు వీక్షించగల కథ, కథనాలు కొరవడడంతో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయని అంటున్నారు. ఇక ప్రస్తుతం వర్మ అంటేనే హీరోలు భయపడుతున్న ఈ తరుణంలో నాగార్జున, తన కుమారుడు అఖిల్ తో ఒక చిత్రం చేయమని వర్మతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్మకు ఇన్ని పరాజయాలు ఎదురవుతున్నా నాగ్ మళ్ళి ఆయనకు తన కొడుకు చిత్రం దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చారంటే ఆయనపై నాగ్ కు వున్న నమ్మకాన్ని మెచ్చుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments