నేల టికెట్ 25 కోట్లా?

Sunday, February 18th, 2018, 03:12:44 PM IST

మాస్ మహారాజ రవితేజ ఇటీవల నటించిన సినిమా టచ్ చేసి చూడు. ఫిబ్రవరి 2వ తేదీన విడుదలయిన ఈ సినిమా ఘోర పరాజయం పాలయింది. రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్‌మహారాజ్‌ ఆ చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నారు. తన సక్సెస్ ను కొనసాగించాలన్న ఆయన ఆశలకు ఆ చిత్రం బ్రేక్ వేసింది. ప్రస్తుతం ఆయన సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి వరుస విజయాలు అందుకున్న కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘నేల టికెట్‌’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చక చకా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన బిజినెస్‌ కూడా దాదాపుగా పూర్తయినట్టుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. సినిమాకు సంబందించిన డిజిటల్‌, శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ దాదాపు 25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. టచ్ చేసి చూడు పెద్దగా ఆడనప్పటికీ ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లో రవితేజకు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్ట్యా ఇంతటి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు….