ఫాన్స్ కి షాక్ ఇవ్వనున్న శ్రేయ?

Tuesday, April 3rd, 2018, 06:45:00 PM IST

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఇష్టం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శ్రేయ శరన్ ఆ తరువాత మెల్లగా తన కెరీర్ లో మంచి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం వున్న దాదాపు అందరు అగ్రహీరోలతో నటించిన ఆమె ఇటీవల తన చిరకాల ప్రేమికుడు రష్యాకు చెందిన ఆండ్రోవ్‌ కోస్‌చేవ్‌ను ముంబైలో పెళ్లి చేసేసుకున్న విషయం తెలిసిందే. అయితే శ్రేయ పెళ్లి దక్షిణాది చిత్ర పరిశ్రమకు, అభిమానులకు షాక్‌ ఇచ్చే అంశమే. అయితే ఇప్పుటికే ఒక తెలుగు చిత్రంలో వెంకటేశ్‌కు జంటగా నటించడానికి అంగీకరించింది ఆమె.

దీంతో శ్రియను దక్షిణాది వెండితెరపై ఇకపై కూడా చూడవచ్చుననుకున్న అభిమానులకు ఆమె మరో షాక్‌ ఇస్తున్నట్లు సమాచారం. అవును శ్రేయ నటనకు గుడ్ బై చెప్పి తన జీవిత భాగస్వామితో కలిసి రష్యాలో మకాం పెట్టడానికి సిద్ధం అవుతున్నారట. అందుకే వెంకటేశ్‌తో నటించడానికి అంగీకరించిన చిత్రాన్ని వదిలేసుకున్నారన్న ప్రచారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఎంతమేరకు నిజం ఉందొ తెలియదు కానీ, ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆమె అభిమానులకు ఇది మింగుడుపడని చేదువార్తనే చెప్పాలి…