గురకపెట్టడమే నేరమా?

Thursday, February 15th, 2018, 12:50:46 PM IST

గురకపెట్టి నిద్రపోవడం ఒక ప్రయాణికుడు పాలిటి శాపంగా మారింది. తాను పెట్టె గురకకు నిద్రాభంగం కలిగిన తోటి ప్రయాణికులు తాము పడుతున్న బాధ అతనికి కూడా తెలిసి వచ్చేలా చేశారు. అయితే ఈ ఘటన ఎల్‌టీటీ-దర్భంగా పవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లోని త్రీటైర్‌ ఏసీ బోగీలో చోటు చేసుకుంది. జబల్‌పూర్‌ స్టేషన్‌లో విధినిర్వహణకు వచ్చిన గణేశ్‌ వి. విర్హా అనే టికెట్‌ ఇన్స్‌పెక్టర్‌ జరిగిన విషయాన్ని వెల్లడించారు. ప్రయాణికుడు రామచంద్ర పెడుతున్న గురక ధాటికి చుట్టుపక్కల బెర్త్‌ల మీదున్న వారెవరికీ కంటిమీద కునుకు రాలేదు సరికదా చిర్రెత్తుకొచ్చింది. అందరూ చాలా సేపు ఓపిక పట్టారు.

అయినా సరే అతని గురక తగ్గకపోవడంతో చివరకు అంతా కలిసి ఒకమాట అనుకుని గురక పెడుతున్న రామచంద్రను నిద్రలేపారు. అతన్ని నిద్రపోనీయకుండా కొన్ని గంటలు ఆపగలిగితే కనీసం మిగిలిన వారంతా కాసేపు నిద్రపోవచ్చనుకున్నారు. అదే విషయాన్ని రామచంద్ర కు చెప్పగా కాసేపు వారిమధ్య కొద్దీ పాటి వాగ్వివాదమే జరిగింది. కాగా చివరకు రామచంద్ర సాటి ప్రయాణికుల మాట విని, దాదాపు ఓ అయిదారుగంటల పాటు నిద్రపోకుండా అలాగే మేలుకుని ఉన్నాడు. అయితే ఈ విషయమై ఆలోచించిన ఆయన ఏ మాత్రం కోపం తెచ్చుకోలేదు సరికదా తనను నిద్రపోనివ్వకుండా అడ్డుకున్న ప్రయాణికులపై ఫిర్యాదు కూడా చేయలేదని, అంతా కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొన్నారని టీసీ వీర్హా అన్నారు …