విమోచన దినమా..? విలీన దినోత్సవమా..?

Tuesday, September 16th, 2014, 03:52:17 PM IST


తెలంగాణ సంస్కృతుల్లో, ఉద్యమాల్లో, పోరాటాల్లో చాలా కీలక ఘట్టాలున్నాయి.వాటిల్లో ఒకటిగా సెప్టెంబర్ 17ను చరిత్ర గుర్తిస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా.. నాటి నిజామ్ పాలనలో కొనసాగిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. దేశమంతా ఆగస్టు 15వ తేదీన స్వేచ్ఛా వాయివులు పీల్చి సంబరాలు చేసుకుంటే.. అవేవి తమకు సంబంధం లేనివన్నట్లుగా నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు ఉండాల్సి వచ్చింది. అయితే స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత స్వతంత్ర రాజ్యాలుగా, సంస్థానాలుగా ఉన్న అనేక ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేసేందుకు నాటి హోంశాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్ధార్ వల్లబభాయి పటేల్ నడుం చుట్టారు. ఇందులో భాగంగానే జునాఘడ్, కాశ్మీర్, హైదరాబాద్ రాష్ట్రాలను సెప్టెంబర్ 17న భారతదేశంలో కలిపారు. నాటి ప్రభుత్వం దీనిని విలీనంగా భావించింది. ఒక వర్గం మతం వాళ్లు విమోచనంగా సంబరాలు చేసుకున్నారు. మరొక వర్గం ప్రజలు విద్రోహంగా నిరసనలు పాటించారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ దినోత్సవాన్ని చాలా రోజులు మరుగుపరిచి వివాదాన్ని తలెత్తకుండా కాంగ్రెస్ పాలనలో కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే బిజెపి మాత్రం హైదరాబాద్ కు స్వాతంత్ర్యం సిద్దించిన రోజుగా సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా గుర్తించింది. తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, చరిత్రల గురించి చెప్పే టిఆర్ఎస్ మాత్రం ఈ వివాదం నుంచి ప్రతిసారి సుతిమెత్తగా తప్పించుకుంటూ వచ్చింది. 2008 సంవత్సరం వరకు మాత్రం విమోచన దినంగానే టిఆర్ఎస్ గుర్తించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ అభిప్రాయాలను నికచ్చిగా చెప్పినా.. చెప్పకపోయినా పెద్ద పట్టింపు ఉండదు. కానీ అధికార పార్టీగా ఈ సారి సెప్టెంబర్ 17వ తేదీని టిఆర్ఎస్ ఎలా గుర్తిస్తుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని గోల్కొండ కోట నుంచి జరిపిన టిఆర్ఎస్ సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహిస్తుందనే ఉత్కంఠ ఉంది.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మాకు స్వాతంత్ర్యం రాలేదని చెప్పే టిఆర్ఎస్ దీనిని స్వాతంత్ర్య దినోత్సవంగా విలీనంగా భావిస్తుందా? మైనారిటీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి, వాళ్లలో కలిసిమెలిసి ఉంటున్న సందర్భంగా విద్రోహమంటుందా? తెలంగాణకు విమోచనం కలిగిందని చెబుతుందా? ప్రస్తుతానికి పార్టీ దగ్గర ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై మాట్లాడడానికి పార్టీలో ఏ నేత కూడా సిద్దంగా లేరు. బిజెపి మాత్రం విమోచనంగా భావించాలని అంటోంది. మైనారిటీలు విద్రోహమేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ సెప్టెంబర్ 17ను కనీసం గుర్తిస్తుందా? గుర్తిస్తే అధికారికంగా నిర్వహిస్తుందా? అనే దానిపైన పార్టీలో మాత్రం ఎవరికీ ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు తొలిసారిగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇబ్బందికరమే. అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంటుందా? గాలికొదిలేస్తుందా? అనేది రెండు రోజుల్లో తేలనుంది.