గ్రామ వాలంటీర్లు చేయాల్సిన పనులు ఇవేనా…?

Friday, August 16th, 2019, 03:00:12 AM IST

ఆంధ్రప్రదేశ్లో జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని సొంతం చేసుకున్నాక వెంటనే ఏపీలోని అన్ని గ్రామాల్లో గ్రామ వాలంటీర్లను నియమించాలని నిర్ణయించుకున్నారు. కాగా ఈమేరకు అన్ని గ్రామాలకు సంబంధించి దాదాపు 2,66,796 మంది వాలంటీర్లను నియమించారు. కాగా ఈ గ్రామా వాలంటీర్ల వ్యవస్థను విజయవాడలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మిగతా కొన్ని గ్రామాల్లో మంత్రులు ఈ గ్రామా వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. అయితే ఈ గ్రామస్వరాజ్యంలో భాగంగా పంచాయితీ రాజ్ వ్యవస్ధను బలోపేతం చేయటమే లక్ష్యం అని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కాగా కొత్తగా ఏర్పాటైన వ్యవస్ధలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,421 మంది వాలంటీర్లు, పట్టణ, వార్డుల్లో 73,375 మంది వాలంటీర్లను నియమించారు. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉంటారు… అదే గిరిజన ప్రాంతాల్లో అయితే ప్రతీ 35 ఇళ్ళకు, పట్టణ ప్రాంతాల్లో అయితే 50-100 ఇళ్ళకు ఓ వాలంటీర్ ఉంటారు. అయితే ఇప్పటివరకు నియామకం అయిన1.33 లక్షల మంది మహిళలు ఉన్నారు. కాగా అందులో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటిలకు కేటాయించారు.

అయితే వారికి కేటాయించిన ఇళ్ల ప్రకారం అక్కడి కుటుంబాలకు సంబందించిన కుటుంబసభ్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాలి, దానికి తోడు తమ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రోడ్ల పరిస్ధితి, మంచినీటి సరఫరా, డ్రైనేజి సదుపాయాలు, కుటుంబాలు తీసుకుంటున్న రేషన్ వివరాలను సేకరించాలి. అక్కడ అర్హులైన వారందరికీ కూడా సరిగ్గా ఫించన్ అందేలా చూడాలి. ఇంకా చెప్పాలంటే ఎవరైనా వృద్దులు అనారోగ్య సమస్యలతో బాధపడితే వారందరిని కూడా దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా వారిమీదనే ఉంటుంది. పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలీ, చిన్నపిల్లలకి సరైన సమయంలో టీకాలు, పోలియో చుక్కలు అన్ని సరిగ్గా అమలయ్యేలా చూడాలి… ఇక వీరందరూ కూడా చిత్తశుద్ధి తో పని చేయాలి అని సీఎం జగన్ వెల్లడించారు.