ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఇస్రో….!

Saturday, January 21st, 2017, 01:19:28 PM IST

isro
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో ఇంకా కొన్ని రోజుల్లోనే మరొక సంచలనం సృష్టించబోతోంది. ఇప్పటికే ఇస్రో ఎన్నో రకాల ప్రయోగాలు చేసి సఫలీకృతం అయ్యింది. ప్రపంచదేశాలన్ని ఇస్రో సాధించిన ఘనతలను చూస్తున్న మిగిలిన దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే ఇస్రో ఇంత విజయవంతం కావడం చైనా, పాకిస్థాన్ లాంటి కొన్ని దేశాలకు మాత్రం మింగుడు పడడంలేదు. ఇప్పుడు ఫిబ్రవరి 15న ఇస్రో చేపడుతున్న ప్రయోగం పైనే ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం అయి ఉంది.

నిప్పులు చిమ్ముతూ ఒక రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్తేనే ఆశ్చర్యపోతాం. అలాంటిది ఇప్పుడు ఇస్రో చేపట్టబోతున్న ప్రయోగంలో ఒకేసారి 104 ఉపగ్రహాలు నింగిని చీల్చుకుంటూ దూసుకుపోనున్నాయి. ఈ అపురూపమైన దృశ్యం మనదేశంలో చోటుచేసుకోవడం మన అదృష్టం. ఒక రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను కక్ష్య లోకి పంపి భారత్ మిగిలిన దేశాలకు సవాల్ విసరబోతుంది. మంగళ్ యాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఆత్మ విశ్వాసంతో ఇప్పుడు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇన్ని ఉపగ్రహాలను ఒకేసారినింగిలోకి పంపిన ఘనత ఏ దేశానికీ లేదు. ఆ ఘనతను మనదేశం మరొక కొన్ని రోజుల్లో సొంతం చేసుకోబోతుంది.