‘హౌస్‌ఫుల్’ నిర్మాత‌కి ప్ర‌తిష్ఠాత్మ‌క ఇటాలియ‌న్ అవార్డ్‌!

Tuesday, February 13th, 2018, 10:57:30 PM IST

ఇట‌లీ, ఫ్రాన్స్ వంటి చోట రెగ్యుల‌ర్‌గా షూటింగులు చేసేందుకు మ‌న ఫిలింమేక‌ర్స్ ఆసక్తి క‌న‌బ‌రుస్తున్నారు. అక్క‌డ చ‌క్క‌ని వాతావ‌ర‌ణం, అంద‌మైన లొకేష‌న్లు అందుకు పురిగొల్పుతున్నాయి. అయితే ఇలాంటి ప్ర‌క్రియ మ‌న టాలీవుడ్‌కి కొత్తేమో కానీ, బాలీవుడ్‌కి గ్రేట్ ఫిలింమేక‌ర్‌, నిర్మాత‌ సాజిద్ ఖాన్ ఎప్పుడో ప‌రిచ‌యం చేశారు. ముఖ్యంగా త‌న సినిమాల్లో ఇట‌లీ లొకేష‌న్ల‌ను అద్భుతంగా చూపించారాయ‌న‌.

బ్లాక్‌బ‌స్ట‌ర్ హౌస్‌ఫుల్ సిరీస్‌, కంబ‌క్త్ ఇష్క్ వంటి చిత్రాల్లో ఇట‌లీని అద్భుతంగా చూపించారు. అందుకే ఇట‌లీ రాయ‌భార కార్యాల‌యం అత‌డిని మ‌ర్చిపోలేదు. ఇండియాలో ఉన్న ఇట‌లీ భార‌త రాయ‌బారి మిస్ట‌ర్‌.లారెంజో యాంజెలోని .. ఆ దేశ ఫిలింక‌మిష‌న్‌ ప్ర‌తినిధి స్టిఫానియా స‌మ‌క్షంలో సాజిద్‌ని స‌త్క‌రించి `వోలేర్ అవార్డు`ను ప్ర‌ధానం చేశారు. 2017లో సాజిద్ నిర్మించిన `జుడ్వా 2` గ‌త ఏడాది 100 కోట్ల క్ల‌బ్ సినిమాగా నిలిచింది. స‌ల్మాన్ హీరోగా నిర్మించిన `కిక్ 2` రిలీజ్ కానుంది. హౌస్‌ఫుల్ సిరీస్‌లో నాలుగో చిత్రం తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. సాజిద్‌కి కేవ‌లం ఇట‌లీ ప్ర‌భుత్వ‌మే కాదు, ఫ్రెంచి ప్ర‌భుత్వం నుంచి ఇలాంటి స‌త్కారం ల‌భించింది ఇదివ‌ర‌కూ.