ఆ రెండు పార్టీలే కారణం!

Thursday, October 16th, 2014, 01:28:57 PM IST

jagadesh-reddy

తెలంగాణ విద్యాశాఖామంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ లో గురువారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే కారణమని తీవ్రంగా ఆరోపించారు. అలాగే ఈ రెండు పార్టీలు యాత్రలు, ధర్నాలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇక కాంగ్రెస్, తెలుగుదేశం చేస్తున్న అసత్య ప్రచారాలను ఆ పార్టీ నేతలే నమ్మడం లేదని, అందుకే ఆ రెండు పార్టీల నేతలు తెరాస లో చేరుతున్నారని జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా తెలంగాణలో తెరాస ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంగా ఈ రెండు పార్టీలు తెలంగాణలో బస్సు యాత్రలను కూడా మొదలు పెట్టాయి. ఈ క్రమంలో అధికార పార్టీ తెరాస నేతలకు, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.