విశ్లేషణ: జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన పార్టీల పరిస్థితి ఇది!

Thursday, January 23rd, 2020, 09:36:27 AM IST

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకే ఒక్క నిర్ణయం జనసేన, టీడీపీ ల కార్యాచరణని దెబ్బ తీసినదని చెప్పాలి. అవినీతి రహిత పాలన అందిస్తానంటూ సంక్షేమ పథకాల అమలులో ఆన్లైన్ విధానాన్ని ఏర్పాటు చేసి పారదర్శక పాలన అందించే విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ వైయస్సార్ పాలనని గుర్తు చేస్తున్నారంటూ విపక్ష నేతలు సైతం జగన్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి తాజాగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం, అభివృద్ధి వికేంద్రీకరణ మార్గం సుగమం అయ్యేలా జగన్ వ్యవహరిస్తున్నారు.

అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణల ఫై త్వరలో విచారణ చేపడతాం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఇదేకాని జరిగితే టీడీపీ నేతలలో కొందరి పేర్లు బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిసున్నారు. 33 వేల ఎకరాల రాజధాని భూమిలో దాదాపు 4 వేల ఎకరాల వరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ నేతలు బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజా అసెంబ్లీ చర్చల్లో ఈ విషయాన్నీ ప్రస్తావించడమే కాకుండా వివరాలు సేకరించి విచారణ చేపట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.

పరిపాలన రాజధానిగా అమరావతిని తరలించే యత్నంలో చంద్రబాబు జోలె పట్టడం పట్ల రాష్ట్ర ప్రజానీకాన్ని, వైసీపీ నేతల్ని, పలువురు రాజకీయ నాయకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో రైతుల ఆందోళనకి మద్దతుగా నిలుస్తూ వైసీపీ ప్రభుత్వం ఫై చేసిన విమర్శలు ఇతర ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంత వాసుల నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేయడం తో చంద్రబాబు ఫై ప్రజల్లో నమ్మకం తగ్గిపోయిందంటూ, ప్రజల్ని రైతుల్ని మోసం చేసారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల అసెంబ్లీ సమావేశాల ద్వారా కొంత రుజువయ్యింది అని పలువురు పేర్కొంటున్నారు.

అమరావతి విషయం లో జనసేన పార్టీ కి తీవ్రంగా దెబ్బ తగిలిందని చెప్పాలి. కేవలం ఒకే ఒక్క స్తానం తో రాష్ట్రంలో జనసేన పార్టీ కి పేరుంది. టీడీపీ నేతల ఫై పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది జరిగి ఉంటే చర్యలు తీసుకోండి అంతేకాని రైతులకు, ప్రజలకు అన్యాయం చేయొద్దు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు సైతం టీడీపీ కి దెబ్బకొట్టేలా కనిపించింది. అయితే ప్రతి విషయం లో జాగ్రత్తగా ఆలోచించే పవన్ కళ్యాణ్ రాజధాని అంశం ఫై ఎలాంటి ముందస్తు నిర్ణయం తీసుకోలేకపోయారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తుది నిర్ణయాన్ని ప్రకటించాక పవన్ తన అభిప్రాయం చెబుతానని అన్నారు. కానీ పవన్ అదే సమయంలో ఎవరికీ ఊహించని విధంగా బీజేపీ తో పొత్తు అంటూ ప్రకటన చేసారు. ఇక ఫై క్రీయాశీల రాజకీయాలలో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తుందని, స్థానిక ఎన్నికల మొదలు వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా అధికారమే లక్ష్యం అంటూ పవన్ తన మార్గాన్ని మరల్చారు.

అయితే ఈ సమయం లో జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం జగన్ సంక్షేమ పథకాలు, రైతులకు రైతు భరోసా ద్వారా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు పూర్తీ మద్దతు అంటూ జనసేన పార్టీ తరపున అసెంబ్లీ లో ప్రకటించారు. పవన్ తో తనకు కమ్యూనికేషన్ లేదని, చర్చలు ఉండబోవని అంటూనే జనసేన పార్టీ తరపున మద్దతు తెలపడం తో జనసేన పార్టీ సొంత ఎమ్మెల్యే కు పవన్ విధానాలు నచ్చలేదని అర్ధం అవుతుంది. రాపాక వరప్రసాద్ జగన్ ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకానికి మద్దతు తెలుపుతూనే వున్నారు. విద్య, వైద్య, రైతు పలు రకాల సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడయ్యాడు.

టీడీపీ కి ప్రజల్లో వున్న బలం ఏంటనేది 2019 ఎన్నికల ద్వారా నిరూపితమవ్వడం, పవన్ కళ్యాణ్ పార్టీ ఒక్కస్థానానికి పరిమితం కావడం జగన్ ప్రభుత్వానికి బలాన్ని చేకూర్చే అంశాలు. ప్రత్యేకంగా రివర్స్ టెండరింగ్, కొత్త ఇసుక విధానం, ఆన్లైన్ విధానం, పారదర్శక పాలన కు మొగ్గు చూపేలా చేస్తున్న చర్యలు, స్పదన తదితర కార్యక్రమాలతో జగన్ తన పాలన పట్ల కాన్ఫిడెంట్ గా వున్నారు. కేవలం ఏడు నెలల్లోనే పవన్ జనసేన పార్టీ ని నడపలేక పొత్తు పెట్టుకుపోవడం, టీడీపీ అమరావతి విషయం లో అసెంబ్లీ సాక్షిగా తన వైఖరి బయట పెట్టడం తో జగన్ కి ఇవి కూడా ప్లస్ అయ్యాయని చెప్పాలి. మరి మున్ముందు చేయబోయే పనులకు జగన్ ప్రజాక్షేత్రంలో మరింత బలమైన నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని మేధావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.