మంగళగిరి ఎమ్మెల్యేకి ఊహించని పదవి అప్పగించిన జగన్

Thursday, June 13th, 2019, 11:28:09 PM IST


ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ని దారుణంగా ఓడించి అక్కడ విజయం సాధించిన వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణ రెడ్డికి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఊహించని పదవి అప్పగించారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఈ పదవికి సంబందించిన ఉత్తర్వులు త్వరలో వెల్లడవనున్నాయి… అయితే లంకేశ్ పై విజయం సాధించిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి కి మంత్రి పదవి ఖాయమని అందరు భావించినప్పటికీ కూడా, జగన్ కేబినెట్ లో తనకి ఎలాంటి చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న సీఆర్‌డీఏ సంస్థకు ఛైర్మన్‌గా నియమిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.
అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలందరికీ కూడా జగన్ నామినేటెడ్ పదవులు ఇస్తూ, వాళ్ళ అలకని తీరుస్తున్నారు. అందులోభాగంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ ఈ పదవి ఇచ్చారని సమాచారం. కాగా అమరావతి నిర్మాణంలో రైతుల నుంచి టీడీపీ ప్రభుత్వం వేలాది ఎకరాలు భూమిని కుట్ర పూరితంగా కొనుగోలు చేస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం చేశారు. రాజధాని పరిసర ప్రాంత ఎమ్మెల్యేగా సీఆర్‌డీఏపై కూడా ఆయనకు పూర్తిస్థాయిలో పట్టు ఉంది. అందువల్లే ఆయనకు సీఆర్‌డీఏ చైర్మన్‌గా పదవి ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.