ఏమి చేస్తారో నాకు తెలియదు..అది మనమే గెలవాలి..అవంతికి కఠినమైన టాస్క్

Wednesday, June 12th, 2019, 06:40:11 PM IST

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైస్సార్సీపీ విజయదుందుభి మోగించి 151 సీట్లు కైవసం చేసుకొని అధికారపీఠంపై ఎక్కి సవారీ చేస్తుంది. అధికారం రుచి మరిగిన వైసీపీ పార్టీ రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం వేగరవేయాలని చూస్తుంది. అలాగే విశాఖపట్నంలో జరిగే నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటి విశాఖ నడిబొట్టున సగర్వంగా తలెత్తుకొని నిలబడాలని చూస్తుంది. ఈ ఎన్నికలను వైస్సార్సీపీ పార్టీ అధినాయకత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోనే అతి పెద్ద సంపన్న నగరం విశాఖపట్నం. 3500 కోట్లు ఏడాది బడ్జెట్‌ తో ఒక వెలుగు వెలిగిపోతుంది. అలాంటి సిటీని చేజిక్కించుకోవాలని ఇటు వైస్సార్సీపీ, అటు టీడీపీ రెండు కూడా గట్టిగానే పోరాడే అవకాశం ఉంది.

మరో పక్క బీజేపీ కూడా ఇక్కడ తమ సత్తా చాటాలని ఉవ్విలాడుతుంది. అలాగే జనసేన కూడా విశాఖ మీద తమకి కూడా పట్టుందని నిరూపించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎవరికీ తగ్గట్లు వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. గత తొమ్మిదేళ్ల నుండి ప్రజా ప్రతినిధులు లేకుండా ప్రభుత్వ అధికారితోనే పనులన్నీ జరుగుతున్నాయి. మునిసిపాలిటీలు, పంచాయతీల విలీనంపై కోర్టు కేసులతో ఎన్నికల నిర్వహణ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు అవన్నీ తొలిగిపోవటంతో 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీనితో వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి జీవీఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. అది అయిపోగానే నోటిఫికేషన్‌ జారీచేసి ఎన్నికలకి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రం మొత్తం మీద వైస్సార్సీపీ గాలి బాగుంది కాబట్టి, ఈ టైంలో ఎన్నికలు వస్తే ఫలితాలు ఆశించిన స్థాయిలో వస్తాయనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో విశాఖసిటీ లోని ఆరు నియోజకవర్గాల్లో బీమిలి,గాజువాక తప్ప మిగిలిన, తూర్పు, ఉత్తరం, దక్షిణ,పడమర నియోజకవర్గాలు మొత్తం టీడీపీ కైవసం చేసుకుంది . దీనిని బట్టి చూస్తే విశాఖ సిటీలో వైసీపీ పట్టులేదని అర్ధం అవుతుంది. దానికి తోడు 2014 లో MP గా పోటీచేసిన విజయమ్మ కూడా ఓటమి చెందారు.. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఎలాగైనా సరే విశాఖ మేయర్ పీఠంపై వైసీపీ జెండాని ఎగురవేయాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నాడు..

ఇదే విషయాన్నీ విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతోను, భీమిలి ఎమ్మెల్యే, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌తోను స్పష్టంచేశారు. ‘మీరేమి చేస్తారో నాకు తెలియదు.విశాఖ మేయర్ స్థానం మాత్రం మనమే గెలవాలి’ అంటూ జగన్ చెప్పినట్లు తెలుస్తుంది..ఇప్పటికే పార్టీలోని ఒక వర్గం విశాఖ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది..మరో పక్క టీడీపీ కూడా విశాఖ లో తమకి ఉన్న పట్టుని నిలుపుకుంటూ, ఎలాగైనా సరే మేయర్ స్థానాన్ని గెలిచి తమ సత్తా నిరూపించుకోవాలని కసిగా ఉన్నారు..ఇప్పటికే టీడీపీ విశాఖ సీనియర్ నాయకులు భేటీ కూడా జరిగినట్లు తెలుస్తుంది. విశాఖలో టీడీపీ కి బలమైన క్యాడర్ ఉంది.. ఆ క్యాడర్ ని తట్టుకొని నిలబడి విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవటం వైస్సార్సీపీకి అంత ఈజీ ఏమి కాదు…