ప్రధానికి జగన్ రహస్య లేఖ – అమరావతి కోసమేనా…?

Friday, August 23rd, 2019, 01:24:38 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం పై రోజుకో చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం హయాంలో రాజధానిని అమరావతి లో నిర్మించాలని సంబంధిత పనులన్నీ కూడా జరిపారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచినటువంటి వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని వేరే చోటుకు తరలిస్తుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈమేరకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి… అయితే రాజధానిని అమరావతిలో నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఆసక్తి చూపడం లేదని, దాన్ని వేరే చోటుకు మార్చే ఉద్దేశంలో ఉన్నారని, ప్రస్తుతానికి అమెరికా పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏపీకి వచ్చాక రాజధాని నిర్మాణం పై అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు పుకార్లు చేస్తున్నాయి…

అయితే ఈ విషయంలో మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఓ అడుగు ముందుకేసి.. రాజధానిని అమరావతి నుంచి మారిస్తే ఆమరణ దీక్షకు కూడా వెనుకాడబోమని, వైసీపీ ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలు హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఈ క్రమంలో మరో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఒక వివరణ ఇస్తూ… అమరావతిని ఎక్కడికీ మార్చబోమన్నారు. కానీ ఇదే సమయంలో దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారాయి. అమరావతి గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంలోని మోదీ సర్కారుకు లేఖలను రాసారని, తక్షణమే ఆ లేఖలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కానీ ఏపీలో జగన్ ప్రభుత్వం నిజంగానే లేఖలు రాసిందా, లేఖ అవన్నీ వట్టి పుకార్లేనా అనే సంగతి మనకు తెలియాల్సి ఉంది.