వైసీపీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరు.. జగన్ సీరియస్..!

Tuesday, October 8th, 2019, 10:10:15 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అవుతున్నా అప్పుడే వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు మొదలయ్యింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటాచలం మహిళా ఎంపీడీవో సరళ ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే, అతని అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యేని, అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై వదిలేసిన సంగతి తెలిసిందే.

అయితే బెయిల్‌పై భయటకొచ్చి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెద్ద కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో ఓ రియల్ ఎస్టేట్ లే అవుట్ వేసి దానికి వాటర్ కనెక్షన్ కావాలని ఎంపీడీవో సరళగారిని అడిగారు. అయితే ఆ పని కాకపోవడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎంపీడీఓకు ఫోన్ చేసి వాటర్ కనెక్షన్ ఇవ్వమని ఎంపీడీవోని అడగగా మా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కనెక్షన్ ఇవ్వకూడదని చెప్పారని అన్నారు. అయితే కోటం రెడ్డి ఎమ్మెల్యే కాకాణికి ఫోన్ చేయగా నీకు తెలీదు ఆ విషయం గురుంచి నువ్వు ఊరుకో అంటూ అన్నారని స్వయంగా కోటం రెడ్డి మీడియాతో చెప్పాడు. అయితే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లాలో తాను చెప్పిందే జరగాలని అనుకుంటుంటే, మరికొందరేమో తమదే అధిపత్య పోరు సాగాలని కోరుకుంటున్నారు. అయితే కోటం రెడ్ది మాటలు బట్టి చూస్తుంటే ఎమ్మెల్యే కాకాణి అతని అనుచరులు కలిసి ఎంపీడీఓ సరళ చేత ఫిర్యాదు చేయించారని ఇదంతా కుట్రపూరితంగానే సాగుతుందని కోటం రెడ్డి అన్నారు. ఏదేమైనా జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తుంది.