జ‌గ్గారెడ్డి కూడా పార్టీ మార‌బోతున్నాడా?

Monday, June 17th, 2019, 08:00:08 AM IST

దేశం వ్యాప్తంగా మోడీ హ‌వా న‌డుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇది స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. దీనికి తోడు పార్టీ అధ్య‌క్షుడి హోదా నుంచి రాహుల్ త‌ప్పుకుంటాన‌ని చెప్ప‌డం, ఆ ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి ఏ సీనియ‌ర్ నేత ముందుకు రాక‌పోవ‌డంతో కీక‌ల కాంగ్రెస్ నేత‌ల్లో అత్మ‌విశ్వాసం స‌న్న‌గిల్లుతోంది. ఇదే మంచి అద‌నుగా భావిస్తున్న అమిత్ షా అలాంటి నేత‌లంద‌రినీ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి లాగాల‌ని స్కెచ్ వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా త‌న మంత్రాంగంతో బీజేపీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొచ్చిన అమిత్ షా దేశ వ్యాప్తంగా వున్న కీల‌క కాంగ్రెస్ నేత‌ల‌పై గురి పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఆయ‌న ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టేశారు. ఎన్నిక‌ల‌కు ముందే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత డీకే అరుణ‌ని బీజేపీలోకి లాగేసిన అమిత్ షా మరి కొంత మంది కీల‌క నేత‌ల్ని బీజేపీలో చేర్చుకోవాల‌ని భారీ స్కెచ్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌ని త‌మ వైపు తిప్పుకున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా ఫైర్ బ్రాండ్ తూర్పు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి అలియాస్ జ‌గ్గారెడ్డిని కూడా బీజేపీలోకి లాగ‌డానికి రంగం సిద్ధం చేసిన‌ట్లు తాజాగా వినిపిస్తోంది. జ‌గ్గారెడ్డి రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్టానాన్ని త‌న‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి విస్తే తెలంగాణ‌లో పార్టీని కాపాడ‌తాన‌ని, మ‌రింత బ‌లోపేతం చేస్తాన‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. అయితే అత‌నికి కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ ల‌భించ‌క పోగా ఆయ‌న మాట‌లే ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌ట‌. దీంతో ఆగ్ర‌హించిన జ‌గ్గారెడ్డి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డితో క‌లిసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే జ‌రిగితే తెలంగాణ‌లో కాంగ్రెస్ కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా బీజేపీ గూటికి చేర‌డం ఖాయం అంటున్నారు.