హ‌వ్వ… సినిమా టికెట్టు ప‌ది ల‌క్ష‌లా?

Tuesday, September 27th, 2016, 12:57:32 PM IST

jaquar
అభిమాన హీరో సినిమా విడుద‌ల‌వుతోందంటే ఎన్ని ఇబ్బందులెదురైనా ఫ‌స్ట్ డే, ఫ‌స్ట్ షో చూడాల‌ని ఆశ‌ప‌డే ప్రేక్ష‌కులు చాలా మందే క‌నిపిస్తుంటారు. వాళ్ల‌కోస‌మే ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేస్తుంటాయి చిత్ర‌బృందాలు. డిమాండ్‌నిబ‌ట్టి ఒక్కో టికెట్టుని వేల రూపాయ‌ల‌కి అమ్ముతుంటాయి. అయినా అభిమానులు వెన‌క్కి త‌గ్గ‌కుండా ఎంతైనా స‌రే టికెట్టు కొని ఫ‌స్ట్ డే, ఫ‌స్ట్ షో కోరిక‌ని తీర్చుకొంటుంటారు. అయితే ఇక్క‌డ మాత్రం వేలు కాదు, ల‌క్ష కాదు, ఒక్క టికెట్టు కోసం ఏకంగా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు వెచ్చించాడు ఓ అభిమాని. ఇంత‌కీ ఆ సినిమా ఏ సూప‌ర్‌స్టార్‌ది అబ్బా? అనేదేగా మీ సందేహం. ఆయ‌నేమీ సూప‌ర్‌స్టార్ కాదు, తొలి సినిమా చేస్తున్న ఓ కొత్త హీరో! నిజంగా ఇది విశేష‌మే క‌దూ! అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకొన్న ఆ క‌థానాయ‌కుడు ఎవ‌రో కాదు, మ‌న మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌న‌వ‌డు,క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా `జాగ్వార్‌` చిత్రంతో ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. మ‌న తెలుగు ద‌ర్శ‌కుడు మ‌హ‌దేవ్ ఆ చిత్రాన్ని తీశాడు. అక్టోబ‌రును ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. కుమార‌స్వామికి కర్ణాట‌క రాష్ట్ర వ్యాప్తంగా మంచి అనుచ‌ర‌గ‌ణం ఉంది. అందుకే అభిమానులంతా ఆయ‌న త‌న‌యుడి సినిమా చూడాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు. ఓ అభిమాని ఏకంగా రూ: 10 ల‌క్ష‌లు ఇచ్చి టిక్కెట్టు బుక్ చేసుకొన్నాడ‌ట‌. ఆ అభిమాని ఎవ‌ర‌నేది సినిమా విడుద‌ల‌య్యాక చెబుతామ‌ని చిత్ర‌బృందం చెబుతోంది. జాగ్వార్ కోసం కుమార‌స్వామి 70కోట్లు ఖ‌ర్చు పెట్టాడు. ఈ రేంజ్‌లో ల‌క్ష‌ల రూపాయ‌ల‌కి టికెట్లు అమ్ముడుపోయాయంటే చిత్ర‌బృందం పెట్టిన డ‌బ్బు అల‌వోక‌గా తిరిగి రావ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. `జాగ్వార్‌` సినిమా ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ క్రేజ్‌తో క‌న్న‌డ సినీ వ్యాపారంలో ఓ రికార్డు క్రియేట్ కావొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments