జ‌క్క‌న్న‌ మ‌ల్టీస్టార‌ర్ .. బాహుబ‌లి మార్కెటింగ్‌ స్ట్రాట‌జీ

Sunday, March 25th, 2018, 12:17:27 PM IST

ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ .. ఇటీవ‌లి కాలంలో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కొస్తున్న పాయింట్ ఇది. వ్యాపారాన్ని ప‌రుగులు పెట్టిస్తేనే ఏదైనా! ఎవ‌రు ఎంత గొప్ప సినిమా చేసినా బిజినెస్ సెట్ చేయ‌డంలో ఫెయిలైతే, ఆ మేర‌కు న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. ఇదివ‌ర‌కూ వ‌చ్చ‌న క్రేజును ఒడిసిప‌ట్టుకుని ముందే టేబుల్ ప్రాఫిట్ తెచ్చుకునే తెలివితేట‌లు ఉండాలి. ఫిలింమేక‌ర్ ఆలోచించే ఏకైక‌ పంథా ఇది. బాహుబ‌లి సిరీస్‌తో రాజ‌మౌళి పేరు అంత‌ర్జాతీయ స్థాయిలో మార్మోగిపోతోంది. అటు బాలీవుడ్ స‌హా విదేశాల్లోనూ అత‌డు సుప‌రిచితం. అమెరాకా, బ్రిట‌న్‌, కొరియా, చైనా, జ‌పాన్, సింగ‌పూర్‌, మ‌లేషియా, కెన‌డా, తైవాన్‌ మార్కెట్ల‌లోనూ అత‌డి పేరు వినిపిస్తోంది. అందుకే రాజ‌మౌళి తెర‌కెక్కించే ప్ర‌స్తుత మ‌ల్టీస్టార‌ర్‌పై అంత‌కంత‌కు అంచ‌నాలు రెట్టింప‌వుతున్నాయి. ఈ సినిమా బ‌డ్జెట్ ప‌రిధి విస్త‌రించింది. ఇక ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీలోనూ బాహుబ‌లి ప్ర‌చారానికి అనుస‌రించిన ప‌ద్ధ‌తినే అనుస‌రించ‌బోతున్నారు.

ఆ క్ర‌మంలోనే ఈ మ‌ల్టీస్టార‌ర్ కోసం చాలా ముందే ప్ర‌మోష‌న్స్‌కి ప్రీప్లాన్ చేయ‌డం టాలీవుడ్‌లో చ‌ర్చ‌కొచ్చింది. అంతేకాదు చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ మల్టీస్టార‌ర్‌ను ప్ర‌మోట్ చేసేందుకు `మార్చింగ్ యాంట్స్‌` అనే ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ‌తో టైఅప్ పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. బాహుబ‌లి సిరీస్‌కి ప్ర‌చార బాధ్య‌త‌ల్ని చేప‌ట్టిన అదే సంస్థ‌కు ఆ సినిమా టైమ్‌లోనే త‌దుప‌రి సినిమాకి సంబంధించిన ప్ర‌చార బాధ్య‌త‌ల్ని క‌ట్ట‌బెట్టార‌ట‌. ఈ కంపెనీయే లాస్ ఏంజెల్స్‌లో చెర్రీ, తార‌క్ ప్ర‌మోష‌న‌ల్ షూట్ చేసింది. ఇదంతా చూస్తుంటే ప్ర‌తిదీ జ‌క్క‌న్న ప‌క్కా ప్రీప్లాన్డ్‌గా వెళుతున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది. త‌దుప‌రి తార‌క్‌, చ‌ర‌ణ్ నాయిక‌ల స‌మాచారం వెలువ‌డ‌నుందిట‌.