జగన్ ని టార్గెట్ చేసిన జనసేన నేత…

Friday, June 14th, 2019, 10:24:07 PM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వాఖ్యలు చేశారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, జగన్ అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై రాపాక వరప్రసాద్ మండిపడ్డారు. జగన్ లో విపరీతమైన దూకుడు కనిపిస్తోందని, కానీ అదే వేగంతో రాష్ట్ర ఆర్థిక స్థితిని కూడా పరుగులు తీయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం దారుణమైన పరిస్థితిలో ఉందని, ఆర్థికంగా సమస్యల్లో ఉందని, అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని ఆకళింపు చేసుకుని తగిన సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని రాపాక అన్నారు. ఎన్నికల సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు, పథకాలకు నిధులు ఎక్కడినుండి సమకూరుస్తారని మండిపడ్డారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోమని హెచ్చరించారు.

“జగన్ ది చాలా చిన్నవయసు. 46 సంవత్సరాలకే సీఎం అయ్యారు. ఉడుకురక్తం కాబట్టి చాలా స్పీడుగా పరిగెడుతున్నాడు. మంచిదేకానీ, అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా అదే ఊపుతో ముందుకు తీసుకెళ్లగలగాలి. అలాంటప్పుడే ప్రజలు ఆయన్ని గుర్తిస్తారు. శాశ్వతంగా రాజకీయాల్లో నిలిచే అవకాశం ఉంటుంది” అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.