పవన్ కళ్యాణ్ ప్రస్తవనతో మార్మోగిన అసెంబ్లీ..ఫిదా అయిన జగన్

Wednesday, July 17th, 2019, 01:50:27 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి,150 మంది సభ్యులున్న వైసీపీ, 23 సభ్యులున్న టీడీపీ వాదోపవాదనలు చేసుకుంటున్నాయి, ఇలాంటి టైంలో ఒకే ఒక్క సభ్యుడిని కలిగిన జనసేన పార్టీ సభ్యుడికి అసలు అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం సరిగ్గా రావటం లేదు. బలాబలాలు ప్రకారం చూస్తే రోజుకి ఒక ఐదు నిముషాలు సమయం రావటమే చాలా గొప్ప. అయితే తనకి వచ్చే కొద్దీ సమయంలోనే జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనదైన ముద్ర వేస్తూ మాట్లాడటం విశేషం.

ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ తీర్మానంపై రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెపుతూ “అధికారపక్షము ఏమైనా మాట్లాడిన వెంటనే నువ్వు దానిని అపోజ్ చేయాలనే రూలేమీ లేదు, ఏమైనా ప్రజోపకార తీర్మానాలు జరుగుతుంటే సపోర్ట్ చేయమని చెప్పారు. అధికారపక్షము ఏమి మాట్లాడిన దానిని వ్యతిరేకించాలని మాత్రం చెప్పలేదు” అంటూ రాపాక పవన్ కళ్యాణ్ గురించి చెప్పటంతో, వైసీపీ సభ్యులు చప్పట్లు చరుస్తూ తమ మద్దతు తెలిపారు. ఆ సమయంలో సీఎం జగన్ కూడా ఆ మాటలకి మెచ్చుకోలుగా చూస్తూ నవ్వుతున్నాడు.

రాపాక అలా చెప్పటంతో వైసీపీ సభ్యులు టీడీపీ వైపు చూపిస్తూ,”వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి” అంటూ ఎద్దేవా చేశారు. ఇక రాపాక మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికీ అనుకూలంగా ఉంది, కాబట్టే జనసేన పార్టీ ఈ బడ్జెట్ కి మద్దతు తెలుపుతుంది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం రైతులకి అండగా నిలిచింది. నేడు ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి కూడా రైతులకి అండగా నిలుస్తున్నాడు అంటూ రాపాక వరప్రసాద్ చెప్పుకొచ్చాడు.