ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్ధతు.. పోరాటానికి సై అంటున్న పవన్..!

Wednesday, October 9th, 2019, 09:42:42 PM IST

తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె తీవ్రతరంగా మారింది. ప్రభుత్వం ఎన్ని బెదిరంపులు చేస్తున్నా ఆర్టీసీ కార్మికులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఆర్టీసీ మనుగడ సాధించాలంటే కొన్ని చర్యలు తప్పవని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని త్వరలో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆర్టీసీలో కొన్ని కీలక మార్పులు తీసుకువచ్చారు. ఆర్టీసీనీ మొత్తం మూడు రకాలుగా విభజిస్తూ 50% బస్సులు ఆర్టీసీ నడుపుతుందని, 30% బస్సులు అద్దెవి నడుపుతామని, మరో 20% బస్సులు పూర్తిగా ప్రైవేట్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.

అయితే ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడబోమని సమ్మెను మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయా పార్టీలు కూడా మద్ధతు తెలుపుతుండడంతో తాజాగా జనసేన కూడా పూర్తి మద్ధతు తెలుపుతుందని తెలంగాణ జనసేన విభాగం తరుపున ఆ పార్టీ నేత శేఖర్ ప్రకటించారు. కార్మికుల తరుపున ఉద్యమించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిద్దంగా ఉన్నారని, కేసీఆర్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపును నిర్ణయాన్ని పవన్ మొన్న తప్పు పట్టిన సంగతి తెలిసిందే.