జపాన్‌లో ‘అయస్కాంత’ రైలు రెడీ!

Thursday, June 6th, 2013, 12:53:59 PM IST

బుల్లెట్ల రైళ్ల తయారీలో జపాన్ మరో అడుగు ముందుకేసింది. చక్రాలు లేకుండా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైలుని తయారు చేసింది. చక్రాలు లేకుండానే, ప్రత్యేక అయస్కాంతత్వ ట్రాకుపై గంటకు 500 కి.మీ. దూసుకుపోయే ‘ఎల్‌ఓ’ మోడల్ రైలును తొలిసారిగా పరీక్షించింది. మధ్య జపాన్‌లోని యమనషి రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ట్రాకుపై రైలును పరీక్షించినట్లు ఈ మేరకు సెంట్రల్ జపాన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రాకు వెంబడి అమర్చిన పరికరాలకు, రైలుకు మధ్య తగినంత ఖాళీ స్థలం ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకుగాను ఐదు బోగీలతోకూడిన ఈ రైలును ట్రాకుపై ఓ ఇంజన్‌తో నెమ్మదిగా లాగినట్లు తెలిపారు. రైలును పూర్తిస్థాయిలో పరీక్షించేందుకుగాను ట్రాకును మరో 43 కి.మీ. మేరకు పొడిగించనున్నట్లు చెప్పారు. ప్రయోగాత్మకంగా సెప్టెంబర్‌లో దీనిని పరుగులు పెట్టించనున్నారు.

జపాన్ రాజధాని టోక్యో, నగోయా నగరాల మధ్య 2027 నుంచి ఈ రైలు పరుగులు తీయనుంది. గంటకు 500 కి.మీ. వేగంతో 40 నిమిషాల్లోనే సుమారు 350 కి.మీ. దూరంలోని గమ్యస్థానాన్ని చేరుకోనుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 40 నిమిషాలకు తగ్గిపోనుంది. తుది రైలుకు 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి వెయ్యి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలదు. 2045 నాటికి ఈ రైలు సర్వీసులను ఒసాకా నగరానికి, తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

అటు.. అయస్కాంత క్షేత్రాల సాయంతో వస్తువులు గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకునేలా చేసే ‘మ్యాగ్నెటిక్ లెవిటేషన్’ లేదా ‘మాగ్లేవ్’ అనే టెక్నాలజీ ఆధారంగానే ఈ రైళ్లు పరుగులు తీస్తాయి. ఇవి అయస్కాంతాల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తప్పించుకుని ట్రాకుకు తాకకుండానే కొంత పైభాగంలో గాలిలో తేలుతూ ఉంటాయి. దీనివల్ల చక్రాల అవసరం ఉండదని జపాన్ రైల్వే అధికారులు తెలిపారు.