పడిన చోటే పైకి లేవాలనుకుంటున్న జేడీఎస్

Friday, September 13th, 2019, 02:25:25 PM IST

ఎమ్మెల్యేల రాజీనామాలతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుండి 14 మంది, జేడీఎస్ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ 17 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అసలే భాజాపా అధికారంలో ఉంది కాబట్టి ఒంటరిగా పోటీకి దిగితే ఓటమి తప్పదని జేడీఎస్ భావిస్తోంది. అంతేకాదు ఏ స్థానాల వలన అయితే అధికారం కోల్పోయామో అదే స్థానాల్లో మళ్లీ జెండా ఎగరేసి తీరాలనే పంతంతో ఉన్నారు దేవేగౌడ.

అందుకే కాంగ్రెస్ పార్టీతో పొత్తును కొనసాగించి ఉపఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే తుది నిర్ణయం రాష్ట నేతల చేతిలో ఉండదు కాబట్టి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ చర్చలు ఫలిస్తే ఉపఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేసే అవకాశం ఉంది. వీరి కలయిక భాజాపా గెలుపు అవకాశాలను తప్పకుండా దెబ్బతీస్తుందని చెప్పొచ్చు.