పార్టీని వీడుతున్నవారికి చంద్రబాబు గుర్తుకురావట్లేడా

Thursday, July 11th, 2019, 05:10:59 PM IST

టీడీపీలో వలసలు పెద్ద నేతలతోనే ఆరంభమయ్యాయి. రాజ్యసభ సభ్యులంతా ఒక్కసారి భాజాపలోకి మారడంతో మీమాంసలో ఉన్న ఇతర నేతలు కూడా త్వరగా పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చేశారు. ఇక బయటికిపోతున్న బడా లీడర్ల అనుచరులు వారి బాటలోనే అడుగులువేస్తూ పార్టీని వీడుతున్నారు. ఇన్నాళ్ళు తమకు అండగా ఉండి రాజకీయ భవిష్యత్తుకు దారిచూపిన నేతలు ఎటువైపు వెళితే తాము కూడా అటువైపే ఉంటామని అంటున్నారు.

అందుకు ఉదాహరణే నిన్న తన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన అన్నం సతీష ప్రభాకర్ వ్యవహారం. ఎమ్మెల్సీ అయిన సతీష్ గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అసలు ఒకసారి ఓడిన ఆయనకు రెండవసారి టికెట్ దక్కడానికి కారణం సుజనా చౌదరి. తన పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించి ఆయనకు టికెట్ ఇప్పించారు సుజనా.

అందుకే ఆయన పట్ల కృతజ్ఞతతో ఆయన వెంటే నడవాలని సతీష్ నిర్ణయించుకుని పార్టీని వీడారు. ఇంతలా కృతజ్ఞతను పాటిస్తున్న సతీష్ సుజనా చౌదరి మాటకి విలువ ఇచ్చి టికెట్ కేటాయించిన చంద్రబాబుకి రుణపడి ఉన్నాననే వాస్తవాన్ని ఎలా మర్చిపోయారో ఏమో.