రాజీనామాలు చేసే ఛాన్సే లేదంటున్న జంపింగ్ ఎమ్మెల్యేలు

Thursday, June 13th, 2019, 06:30:30 PM IST

పార్టీని విడిపోవడమే కాకుండా శాసనసభా పక్షాన్ని తెరాసఎల్పీలో విలీనం చేసినందుకుగాను 12మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ గుర్రుగా ఉంది. భట్టి, ఉత్తమ్ లాంటి నేతలు రోడ్లపైకి వచ్చి మరీ దీక్షలు చేస్తున్నారు. అన్యాయంగా శాసనసభా పక్షాన్నీ విలీనం చేశారని కోర్టులో పిటిషన్లు వేశారు. ఈమేరకు శాసనసభ స్పీకర్‌కు, 12మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీఅయ్యాయి.

వీటిపై స్పందించిన సదరు 12మనది ఎమ్మెల్యేలు పైలట్‌ రోహిత్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డి.సుధీర్‌రెడ్డి, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, రేగ కాంతారావు, ఆత్రం సక్కు, వనమా వెంకటేశ్వరరావు, జె.సురేందర్, చిరుమర్తి లింగయ్యలు తాము రాజ్యాంగబద్దంగానే తెరాసలో విలీనమయ్యామని, శాసనసభాపక్షంలో మూడింట రెండొంతుల మంది కోరుకుంటే విలీనం చేయవచ్చని రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఉందని, ఆమేరకు చేశామని తమని తాము సమర్థించుకున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు రాజీనామాలు చేసేది లేదని, ఒకవేళ తమకి అవసరం అనిపిస్తేనే చేస్తామని అంటూ త్వరలో హుజూర్ నగర్లో జరగనున్న బైఎలక్షన్లో తేల్చుకుందామని ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు జనం సైతం తమ నిర్ణయాన్ని ఆమోదించి తెరాసను పరిషత్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించారని గెలుపులో క్రెడిట్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు.