ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి జూపూడి రాజీనామా

Wednesday, June 12th, 2019, 08:16:46 PM IST

కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తేదేపా నేత‌లంతా ప‌ద‌వులకు రాజీనామా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నామినేటెడ్ ప‌ద‌వుల‌న్నీ హుష్ కాకి అన్న చందంగా చేజారిపోతున్నాయ్. ప‌ద‌వులు వ‌దిలేస్తున్న నాయ‌కులంతా ఉస్సుర‌నిపోతున్నారు. ఈ జాబితాలో కె.రాఘ‌వేంద్ర‌రావు, అంబికా కృష్ణ స‌హా ప‌లువురు పెద్ద‌లు ఉన్నారు.

తాజాగా మ‌రో వికెట్ ప‌డింది. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ త‌న‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోషల్ వెల్ఫేర్ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో తాను ఈ పదవిని చేపట్టానని అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తన రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయ‌న వెల్ల‌డించారు. ఎస్సీలతో పాటు ఇతర బలహీన సామాజికవర్గాలతో కలసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సంద‌ర్భంగా జూపూడి తెలిపారు. ప్రజల కోసం పని చేసే అవకాశం దక్కడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఏపీలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యాక‌ వైసీపీ ప్రభుత్వం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ నేడు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే.