ఒక రోజు ముందే డైనోసార్ బంతాట‌

Monday, May 28th, 2018, 10:00:35 AM IST

ఇరుగు పొరుగు సినిమాలు టాలీవుడ్‌పై దండ‌యాత్ర చేస్తున్నాయి. ఇటీవ‌ల త‌మిళ సినిమాల హ‌వా త‌గ్గినా, హాలీవుడ్ దాడి మాత్రం అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇప్ప‌టికే స‌మ్మ‌ర్‌లో రిలీజైన అన్ని హాలీవుడ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో అద్భుత వ‌సూళ్లు సాధించాయి. ఇండియా వ్యాప్తంగా స్థానిక భాష‌ల్లో రిలీజై దుమ్ము దులిపేస్తున్నాయి పాశ్చాత్య సినిమాలు. అవెంజ‌ర్స్ – ఇన్‌ఫినిటీ వార్‌, బ్లాక్ పాంథ‌ర్‌, డెడ్‌పూల్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 300కోట్లు వ‌సూలు చేసి, మ‌న సొమ్ముల్ని ఎగ‌రేసుకుపోయాయ‌ని ట్రేడ్ విశ్లేషించింది.

ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌. ఈసారి డైనోసార్ ఒక‌టి తెలుగు రాష్ట్రాల‌పై దాడి చేయ‌బోతోంది. ఇక్క‌డ సొమ్ముల్ని అకౌంట్లో వేసుకుని జంప్ చేయ‌బోతోంది. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ బ్రేకింగ్ న్యూస్ వివ‌రాలిలా ఉన్నాయి. జురాసిక్ వ‌ర‌ల్డ్ 2 చిత్రం ఇండియాలో ఒక‌రోజు ముందే ఎటాక్ చేయ‌బోతోంది. జూన్ 7న ఇండియాలో ఇంగ్లీష్‌, హిందీ, త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో బాక్సాఫీస్ వేట‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇత‌ర దేశాల్లో జూన్ 8న రిలీజ్ కానుంది. స‌రిగ్గా ఈ ఏడాదితో జురాసిక్ పార్క్ సిరీస్ ప్రారంభ‌మై 25 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఫాలెన్ కింగ్ డ‌మ్ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తున్నారు స్పీల్‌బ‌ర్గ్‌. జె.ఎ.బ‌యోనా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇండియాలో బంతాట ఒక‌రోజు ముందే మొద‌ల‌వుతోంద‌న్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments