3డి రిలీజ్ లేక తీవ్ర నిరాశ‌!

Thursday, June 7th, 2018, 02:52:49 AM IST

ఇన్నాళ్లు జురాసిక్ వ‌ర‌ల్డ్ – ఫాలెన్ కింగ్‌డ‌మ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసిన‌వాళ్లు సైతం ఉన్న‌ట్టుండి నిరాశ‌ప‌డిపోయారు. డైనోసార్ విన్యాసాల్ని 3డిలో, ఐమ్యాక్స్ 3డిలో వీక్షించాల‌నుకున్న అభిమానులంతా నీర‌స‌ప‌డిపోయారు. రిలీజ్ ముందే అంత నీర‌సం తెప్పించేంత దారుణం ఏం జ‌రిగింది? అంటారా? చాలా ప‌రాభ‌వ‌మే ఆడియెన్‌కి మిగిలనుంది.

జురాసిక్ వ‌ర‌ల్డ్ 2 చిత్రాన్ని ఇండియ‌న్ అభిమానులు 3డిలో చూడ‌లేరు. ఎందుకంటే ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని కేవ‌లం 2డిలో మాత్ర‌మే రిలీజ్ చేస్తున్నారు. అందువ‌ల్ల 3డి అభిమానులెవ‌రూ ఈ సినిమాని వీక్షించే ఆస్కారం లేనేలేదు. అస‌లింత‌కీ ఎందుక‌ని 3డిలో రిలీజ్ కావ‌డం లేదు..? అంటే 3డి గ్లాస్ ద‌గ్గ‌ర ఇండియా డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌ల‌తో గొడ‌వ పెట్టుకోవ‌డ‌మే అందుకు కార‌ణం. 3డి క‌ళ్ల‌ద్దాల‌తో వ‌చ్చే సొమ్ముల్లో 50 శాతం వాటాను నిర్మాత‌లు అడ‌గ‌డంతో ఇండియా డిస్ట్రిబ్యూట‌ర్లు స‌సేమిరా అనేశారు. అంతేకాదు.. నిర్మాత‌లు దిగి రాక‌పోవ‌డంతో ఇండియాలో ఇక 3డిని రిలీజ్ చేయ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ దెబ్బ ఫాలెన్‌కింగ్‌డ‌మ్‌పై పెద్ద రేంజులోనే ప‌డ‌నుంది. దేశంలోని 3డి అభిమానులెవ‌రూ క‌చ్ఛితంగా ఈ సినిమా చూడ‌రు. 2డిలో చూసినా అంత సంతృప్తి చెంద‌రు. ఇక‌పోతే నిర్మాత‌- పంపిణీదారు గొడ‌వ స‌ద్ధుమ‌ణిగితే హ‌ఠాత్తుగా 3డిలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఆస్కారం ఉంది. అందుకే అప్ప‌టివ‌ర‌కూ వేచి చూసేవాళ్లు ఉండ‌నే ఉంటారు. మొత్తానికి జురాసిక్ వ‌ర‌ల్డ్ ఇండియాలో రికార్డులు క్రియేట్ చేసే ఆస్కారం క‌నిపించ‌డం లేదు. ఇక‌పోతే ఇత‌ర ప్ర‌పంచ దేశాల్లో మాత్రం య‌థావిధిగా 3డి, 2డిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.