షాకింగ్ ట్విస్టు : తితిదే ఛైర్మ‌న్‌గా ద‌ర్శ‌కేంద్రుడు?

Saturday, January 20th, 2018, 07:00:43 PM IST

చ‌ద‌ల‌వాడ త‌ర్వాత ప్ర‌తిష్ఠాత్మ‌క‌ తి.తి.దే ఛైర్మ‌న్ ఎవ‌రు? ఇన్నాళ్లు స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఎంపీలు ముర‌ళిమోహ‌న్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పేర్లు ప్ర‌ముఖంగా వినిపించాయి. దేవుడి ప‌ద‌వి కోసం ఆ ఇద్ద‌రూ పోటీప‌డుతున్నార‌ని, ఆ ఇద్ద‌రి మ‌ధ్యా తీవ్ర‌మైన పోటీ నెల‌కొంద‌ని వార్త‌లొచ్చాయి. అయితే చంద్ర‌బాబు మాత్రం ఆ ప‌ద‌విని రీప్లేస్‌ చేయ‌కుండా అలానే ఉంచారు ఇన్నాళ్లు. సైలెంటుగా ఉన్న‌ట్టుండి బాంబు పేల్చారిలా.

మొత్తానికి తిరుమ‌ల‌తిరుప‌తి వెంక‌న్న సామి క‌రుణించి, ప్ర‌త్య‌క్ష‌మై త‌న ప‌ద‌వికి తానే ఓ అర్హుడిని ఎంపిక చేసుకున్నారు. ప్రముఖ సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు, బి.ఎకు ఆ అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌తిష్ఠాత్మ‌క తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఛైర్మ‌న్‌గా ద‌ర్శ‌కేంద్రుని ఎంపిక చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం రాఘ‌వేంద్రునిలో కోటి రాగాలు ప‌లికించేదేన‌ని చెప్పొచ్చు. తిరుమ‌లేశునిపై ఒక‌టి కాదు రెండు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీశారాయ‌న‌. అప్ప‌ట్లోనే నాగార్జున క‌థానాయ‌కుడిగా `అన్న‌మ‌య్య` చిత్రాన్ని తెర‌కెక్కించి అందులో ధేధీప్య‌మానంగా తిరుమ‌లేశుని ఆవిష్క‌రించారు. గ‌త ఏడాది `ఓం న‌మో వెంక‌టేశాయ‌` అంటూ ఏకంగా సామివారి పేరుతోనే సినిమా తీశారు. మొత్తానికి ఆప‌ద‌మొక్కుల‌వాడు ఆదుకున్నాడు. ప‌ద‌వి రూపంలో ఛాన్సిచ్చాడు. ఇక రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైన‌ట్టే. అయితే ఈ ప‌ద‌విని కాపాడుకుంటూ సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి క‌ష్టం క‌ల‌గ‌కుండా రాఘ‌వేంద్ర సామి కాపాడుతాడ‌నే ఆశిద్దాం. మ‌రో కోణంలో చూస్తే.. ఈ ప‌ద‌వి కోసం గంపెడాశ‌లు పెట్టుకున్న రాయ‌పాటి ఇక రామ‌రామ అనుకుంటూ కొత్త‌ స్తోత్రం పాడాల్సిందే. ఈ ప‌ద‌వితో స్వ‌ర్గానికేగుతాను అని కంక‌ణం క‌ట్టుకున్న ఆయ‌న‌కు క‌న్నీరే మిగిలింది. ఇక బాబు స్నేహాన్ని అడ్డుపెట్టుకుని దేవుడి ప‌ద‌విని ఆస్వాధించాల‌నుకున్న ముర‌ళిమోహ‌న్ క‌ల నెర‌వేర‌లేదు. ప్చ్‌!! అంతా బాబుగారి చ‌లువ‌! వెంక‌టేశుని మాయ‌!!