అరెస్ట్ చేసినా, చంపినా భయపడను.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు..!

Friday, April 30th, 2021, 05:35:04 PM IST

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తున్నా, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి తీరుతామని తెల్చి చెప్పడంతో పాటు, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను కూడా చేస్తుంది. అయితే పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్ష చేపట్టారు.

అయితే రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్న కేఏ పాల్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుర్రున్న వారెవరైనా ఈ సమయంలో పరీక్షలు పెడతారా అని ప్రశ్నించారు. పనికిమాలిన విద్యాశాఖ మంత్రి మాటను సీఎం జగన్ వినవద్దని సూచించారు. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పాల్ డిమాండ్ చేశారు. జగన్ తన సొంత కూతుర్లను పరీక్షలు రాయించేందుకు పంపిస్తారా అని నిలదీశారు. మే 3న హైకోర్టులో జరిగే విచారణలో పరీక్షలు వాయిదా పడతాయన్న విశ్వాసం తనకుందని పాల్ ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు తాను ఆమరణ దీక్ష కొనసాగిస్తానని నన్ను అరెస్టు చేసినా, చంపినా దేనికి తాను భయపడనని కేఏ పాల్ అన్నారు.