ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకం.. జగన్ సర్కార్‌పై కేఏ పాల్ సీరియస్..!

Wednesday, April 28th, 2021, 08:00:17 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండడంపై కేఏ పాల్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతూ పోతుందని, నిన్న విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోవడం బాధాకరమని పాల్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం అవివేకమని, కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితిలో సీఎం జగన్ పిల్లలను పరీక్షలకు పంపుతారా? లేక మంత్రులు పంపుతారా? అని ప్రశ్నించారు.

అయితే కరోనా సునామీ కన్నా ప్రమాదకరంగా మారిందని అన్నారు. ఎన్నికల సమయాల్లో బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా ప్రభలడానికి ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం మరింత కారణమయ్యిందని అన్నారు. దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్, కిట్లు పంపించాలని పొరుగు రాష్ట్రాల సీఎంలను, విదేశీ నేతలను కోరినట్టు తెలిపారు. ప్రజలు, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.