చంద్ర‌బాబుకు షాకిచ్చిన‌ సీనియ‌ర్ నేత‌!

Monday, July 29th, 2019, 07:08:07 PM IST

చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అమెరికాలో వుండ‌గా క‌డ‌ప జిల్లా నుంచి కీల‌క నేత టీడీపీకి గుడ్‌బై చెప్ప‌డం క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త కొన్నేళ్లుగా క‌డ‌ప టీడీపీలో వీర విధేయుడిగా వున్న సీనియ‌ర్ నేత వీర శివారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి జంప‌వుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చంద్ర‌బాబుని ఎంత‌గా అడిగినా బాబు త‌న‌కు టిక్కెట్ కేటాయించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. దాంతో గ‌త కొన్ని నెల‌లుగా వీరి శివారెడ్డి పార్టీకి దూరంగా వుంటూ వ‌స్తున్నారు. ఇటీవ‌లే టీడీపీని వీడి ఆయ‌న వైసీపీలో చేర‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల వేళ టీడీపీ పార్టీ త‌రుపున ప్ర‌చారానికి కూడా వీర‌శివారెడ్డి వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.ఆ విష‌యం తెలిసి చంద్ర‌బాబు ఆయ‌న‌ను దారికి తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు. ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పి త‌న ప‌ని చేయించుకున్నారు. అయితే పార్టీ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓట‌మి పాలు కావ‌డంతో మ‌న‌సు మార్చుకున్న వీర శివారెడ్డి వైసీపీ వైపు వెళ్ల‌డానికే ఆస‌క్తిని చూపించార‌ట‌. టీడీపీ నేత‌లు ఎంత బుజ్జ‌గించినా వీర శివారెడ్డి లొంగ‌లేద‌ని, చివ‌రికి సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో త్వ‌ర‌లో వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం టీడీపీ వ‌ర్గాలని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.