నేడు కవి కాళోజీ జయంతి

Tuesday, September 9th, 2014, 11:47:53 AM IST


తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణరావు శత జయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ వేడుకలను బ్రహ్మాండంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా దీనిని పురస్కరించుకుని హైదరాబాద్ లోనూ, కాళోజీ జన్మస్థలం వరంగల్ లోను ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, రెండింటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక కెసిఆర్ ఉదయం వరంగల్ వెళ్లి అటుపై సాయంత్రం హైదరాబాద్ లో జరిగే వేడుకలలో పాలుపంచుకోనున్నారు.

కాగా హైదరాబాద్ లోని రవీంద్రభారతి మాదిరిగా వరంగల్ లో కాళోజీ సంస్మరణార్ధం ‘కాళోజీ కళా కేంద్రం’ ఏర్పాటుకు ఈ రోజు కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక 1914లో జన్మించిన కాళోజీ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ తొలితరం ఉద్యమనేతగా వినుతికెక్కారు. తన అద్భుతమైన కవితల ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్యమ బాట పట్టించి ‘నా గొడవ’ తరహా రచనలతో జాగృతులను చేసారు. అటుపై కాళోజీ 2002, నవంబర్ 13న తన 88వ ఏట మరణించారు.