క‌మ‌ల్‌హాస‌న్ పాత సినిమాకి కొత్త సొబ‌గులు

Tuesday, March 27th, 2018, 01:08:13 AM IST

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం -2 త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు `శ‌భాష్ నాయుడు` చిత్రాన్ని పూర్తి చేసే స‌న్నాహాల్లో ఉన్నారు క‌మ‌ల్‌. ఇదే స‌మ‌యంలో అత‌డు కొత్త రాజ‌కీయ పార్టీ పెట్టి కొత్త ట‌ర్న్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్ని యూట‌ర్న్ తిప్పాల‌న్న త‌ప‌న‌తో క‌మ‌ల్ చెల‌రేగిపోతున్నాడు. `మ‌క్క‌ల్ నీది మ‌య్యం` పార్టీని వేగంగా విస్త‌రిస్తూ ఇత‌రుల గుండెల్లో గుబులు పెంచుతున్నాడు. రానున్న ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌భావం ఉంటుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.

అయితే క‌మ‌ల్ సుదీర్ఘ కాలం సినిమాల‌కు దూర‌మై రాజ‌కీయాల‌కే అంకిత‌మైతే, ఈలోగా అభిమానులు నిరాశ చెంద‌కుండా ఓ కొత్త ప్లాన్ కూడా సిద్ధ‌మైంద‌ని అర్థ‌మ‌వుతోంది. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన పాత క్లాసిక్స్‌ని కాస్తంత డిజిట‌ల్ మాష్ట‌రింగ్ చేసి తిరిగి రిలీజ్ చేస్తే వాటిని ఫ్యాన్స్‌ వీక్షించే అవ‌కాశం ఉంటుంది. ఆ క్ర‌మంలోనే క‌మ‌ల్ హాస‌న్ – అంబిక జంట‌గా న‌టించిన మేటి క్లాసిక్ సినిమా `కాక్కై సెట్టై` చిత్రాన్ని డిజిట‌ల్ మాష్ట‌రింగ్ చేసి ఈనెల 30న రిలీజ్ చేస్తున్నారు. ఒక‌వేళ ఈ మూవీ స‌క్సెసైతే క‌మ‌ల్ న‌టించిన ప‌లు క్లాసిక్స్‌ని డిజిట‌ల్ లో రెన్యువ‌ల్ చేసి రీరిలీజ్ చేస్తార‌న్న‌మాట‌. ఇదివ‌ర‌కూ ఈ త‌ర‌హాలో నాటి మేటి క్లాసిక్ `మాయాబ‌జార్‌` మ‌న‌కు రిలీజైన సంగ‌తి తెలిసిందే.