గుండెపై చెయ్యి వేసుకుని నిజం చెప్పండి

Thursday, September 18th, 2014, 07:03:00 PM IST


ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని రోగుల నుండి ఎటువంటి పిర్యాదు రానివ్వకుండా మెరుగైన వైద్య సేవలు అందించే డాక్టర్లకు పదోన్నతులు కల్పిస్తామని చెప్తూనే, విధులు సక్రమంగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే వైద్యులు తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు వరకు కచ్చితంగా ఆసుపత్రిలో ఉండాల్సిందేనని కామినేని ఆదేశించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ”నిధులు ఎంత కావాలంటే అంత విడుదల చేస్తా. విధులు సక్రమంగా నిర్వహిస్తారా?రోగులకు సరైన సేవలు అందచేస్తారా? గుండెలపై చెయ్యి వేసుకుని చెప్పండి’ అంటూ జిల్లా అధికారులను సూటిగా ప్రశ్నించారు. దీనితో అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇక ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు యధావిధిగా ఉంటున్నాయంటూ కామినేని ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే గవర్నమెంట్ డాక్టర్ల తీరు వల్లే సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటుపై విజయవాడను హైదరాబాద్ కు మించిన మెడికల్ హబ్ గా తయారు చేసేందుకు ప్రభుత్వం సర్వ విధాల ప్రయత్నం చేస్తోందని కామినేని తెలిపారు. ఇక త్వరలో విజయవాడలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్లు కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.