చంద్రబాబుకు సంస్కారం లేదు.. కాపు నేత ముద్రగడ ఘాటు లేఖ..!

Friday, September 20th, 2019, 06:13:02 PM IST

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి నిప్పులు చెరిగేలా ఘాటైన లేఖను రాసారు. కోడెల శివప్రసాద్ అంతిమ యాత్రలో చంద్రబాబు రెండు చేతులు చూపించడం నిజంగా సంస్కారహీనమని దుయ్యబట్టారు. అంతేకాదు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని చంద్రబాబు పదే పదే ఆరోపించడం సరికాదని మండిపడ్డారు.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను చంద్రబాబు తన అదుపులో పెట్టుకున్నారని అది మరిచిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతుండడం సబబు కాదని అన్నారు. అయితే కోడెల లోకేశ్ గురించి ప్రశ్నిస్తే చంద్రబాబు ఆయనపై మండిపడ్దారని ఇప్పుడేమో ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. అంతేకాదు కాపు ఉద్యమ సమయంలో తన కుటుంబాన్ని చంద్రబాబు ఎంతగానో వేధించారని అది మరిచిపోయి ఇప్పుడు చంద్రబాబు నీతి మాటలు చెబుతున్నారని చంద్రబాబు వేధింపులకు తట్టుకోలేక తమ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళామని కానీ మాకున్న మనోధైర్యంతో ఆత్మహత్యకు పూనుకోలేదని అన్నారు.