బాబు సమావేశంలో పవన్ ప్రస్తావన

Tuesday, July 2nd, 2019, 01:14:01 PM IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిన్న నిర్వహించిన కాపు నేతల సమావేశంలో పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించటం జరిగింది. ఈ విశ్లేషణలో ప్రధానంగా పార్టీ ఓటమికి కాపు ఓటర్లు దూరమవడమే కారణమని తేల్చారు. పార్టీ పెట్టినప్పటి నుండి కాపు ఓటర్లకు పార్టీ అన్ని విధాలా అండగా ఉన్నా వారెందుకు తిరస్కరించారు అనే విషయమై సమగ్రంగా ఆలోచించగా కొన్ని కారణాలను వెలికితీశారు నేతలు.

ఆ కారణాల్లో పవన్ కళ్యాణ్ తో పార్టీ పొత్తు పెట్టుకోకపోవడమే ప్రధానమైనదని తేల్చారు. పలువురు పార్టీ నేతలు పవన్ మూలంగానే కాపుల ఓట్లు సగం చీలిపోయాయని, జనసేన గనుక తమతో ఉండి ఉంటే కనీసం బలమైన ప్రతిపక్షంగా ఉండి ఉండేవారిమని చంద్రబాబుతో చెప్పారట. బాబు సైతం వారి అభిప్రాయాలతో ఏకీభవించినట్టు తెలుస్తోంది. ఇకపై భవిష్యత్తులో కాపు ఓటర్ల మద్దతును తిరిగి సంపాదించేందుకు బలమైన వ్యూహ రచన చేయాలని సూచించారట.