కేసీఆర్‌పై నిప్పులు చెరిగిక క‌ర్ణాట‌క మంత్రి!

Sunday, June 9th, 2019, 11:23:58 PM IST

తెలంగాణ ముఖ్య‌మంత్రి, గులాబీ ద‌ళ‌ప‌తి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుపై ప‌క్క రాష్ట్రాల నాయ‌కులు కూడా మండిప‌డ‌టం మొద‌లైంది. కేసీఆర్‌పై క‌ర్ణాట‌క ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ర‌మేశ్వ‌ర్ ఆదివారం హైద‌రాబాద్‌లో నిప్పులు చెరిగారు. ప్ర‌జా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నార‌ని ఆగ్ర‌హాన్ని వెల్ల‌గ‌క్కారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను గౌర‌వించి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ప్ర‌క‌టిస్తే తెలంగాణ వ‌చ్చాక ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వ‌ర్తిస్తే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నార‌ని ఈ సంద‌ర్భంగా మండిప‌డ్డారు.

తెరాస‌లో కాంగ్రెస్ సీఎల్పీని వీలినం చేయ‌డం అధ‌ర్మం అంటూ కాంగ్రెస్ సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ దీక్ష‌కు సంఘీభావంగా ఆదివారం హైద‌రాబాద్ వ‌చ్చిన ప‌ర‌మేశ్వ‌ర్ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక తొలి ప్ర‌భుత్వంలో ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పి ఆ మాట‌ని కేసీఆర్ విస్మరించార‌ని, ఇప్పుడు ద‌ళితుడు ప్ర‌తిప‌క్ష నేతగా కూడా వుండ‌కూడ‌ద‌ని కేసీఆర్ అధ‌ర్మంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని దుమ్మెత్తిపోశారు. క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఈ విష‌యంలో ఎల్ల‌ప్పుడూ టీ కాంగ్రెస్‌కు అండ‌గా వుంటుంద‌ని హెచ్చ‌రించడం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.