భూసేకరణ శాపం కాకూడదు!

Wednesday, October 15th, 2014, 06:10:10 PM IST

kcr13
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం హైదరాబాద్ లో భూసేకరణపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు అవసరమైన భూసేకరణ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. అలాగే భూసేకరణలో భూమిని కోల్పోయే వారికి అండగా నిలబడాలని, బాధితులకు పునరావాస ప్యాకేజీ వీలైనంత త్వరగా ఇవ్వాలని కెసిఆర్ పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ మానేరు డ్యాం నిర్మాణంలో తమదీ బాధిత కుటుంబమేనని ఆ బాధ తనకు తెలుసునని పేర్కొన్నారు. అలాగే పరిహారం డబ్బు ముందుగానే బ్యాంకుల్లో వేయాలని, పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి నిర్వాసితులకు రాకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇక భూసేకరణ అనేది నిర్వాసితులకు శాపంగా మారకూడదని, భూనిర్వాసితుల పరిహార నిర్ధారణకు రాష్ట్ర, జిల్లా కమిటీలు వేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు.