నిర్వాసిత గిరిజనులకు భారీ పరిహారం

Saturday, October 18th, 2014, 09:30:22 PM IST

kcr13
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ లో శనివారం విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ళ నిర్వాసితులకు అత్యుత్తమ ప్యాకేజీని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిర్వాసితులయ్యే గిరిజనులకు పునరావాసం కల్పిస్తామని, ఏ రాష్ట్రం ఇవ్వనంత ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఎకరా లక్ష రూపాయలు ఉంటే వారికి నాలుగు లక్షల రూపాయలు పరిహారం అందుతుందని తెలిపారు. అలాగే రిజిస్ట్రేషన్ విలువ కంటే రెండు రెట్లు ఎక్కువ పరిహారం ఇస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఇక తండాలు, గూడెంలను పంచాయితీలుగా మార్చడానికి నిర్ణయించామని, దీనిపై ఎస్టీ నేతలతో మాట్లాడి విధివిధానాలను ఖరారు చేస్తామని కెసిఆర్ వెల్లడించారు. అలాగే గిరిజన పారిశ్రామికవేత్తలు ప్రోత్సాహకాలను అందుకోవడానికి సిద్ధం కావాలని, గిరిజన ప్రాంతాలలో అక్షరాస్యత, విద్యా సంస్థలపై అధ్యయనం చేస్తామని కెసిఆర్ తెలిపారు.