కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్న అమ‌ర‌వీరుల కుటుంబాలు!

Saturday, June 8th, 2019, 12:45:53 PM IST

తెలంగాణ కోసం అసువులు బాసిన అమ‌ర‌వీరుల కుటుంబాలు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై దుమ్మెత్తిపోత‌స్తున్నాయి. ఆయ‌న మాట త‌ప్పార‌ని మండిప‌డుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతో మంది ప్రాణాలు ప‌ణంగా పెట్టారు. వారి త్యాగాల ఫ‌లితం, కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింది. అయితే ఆ త‌రువాత తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వారి గుర్తుగా అసెంబ్లీ ఎదురుగా వున్న గ‌న్ పార్క్ వ‌ద్ద అమ‌ర‌వీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే వారి త్యాగాల‌ను మాత్రం మ‌రిచారు. ప్రాణ త్యాగం చేసిన వారి ఇంటి కొక ఉద్యోగం, 10 ల‌క్ష‌ల న‌గ‌దు అంద‌జేస్తామ‌ని గొప్ప‌లు చెప్పారు కానీ చేత‌లు మాత్రం శూన్యం.

అమ‌ర‌వీరుత స్మృతివ‌నం నిర్మిస్తామ‌న్నారు. వీటిలో ఏదీ కార్య‌రూపం దాల్చ‌లేదు. అమ‌రుల కుటుంబాల‌కు న్యాయం చేయ‌డం కోసం జీవో 80ని తీసుకొచ్చారు కానీ ఎలాంటి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్ట‌లేదు. దీంతో ఆగ్ర‌హించిన అమ‌ర‌వీరుల కుటుంబాలు కేసీఆర్‌ని నిల‌దీయ‌డం మొద‌లుపెట్టాయి. తెలంగాణ ఏర్ప‌డి ఏళ్లు గ‌డుస్తున్నా అమ‌ర వీరుల‌కు సంబంధించిన‌ జీవోను అమ‌లు చేయ‌లేద‌ని, దాన్నివెంట‌నే అమ‌లు చేయాల‌ని గ‌న్ పార్క్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగారు. కేసీఆర్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకోలేద‌ని, మాట త‌ప్పార‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. మా బిడ్డ‌లు త్యాగాలు చేస్తే రాజ‌కీయ నాయ‌క‌లు భోగాలు అనుభ‌విస్తున్నార‌ని మండిప‌డ్డారు. దీనిపై అధికార తెరాస ఏమ‌ని స‌మాధానం చెబుతుందో చూడాలి అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.