మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి

Saturday, October 18th, 2014, 11:08:18 AM IST

kcr-and-ministers
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర నెలలైంది. ఓవైపు క‌రెంట్ కోత‌లు, మ‌రోవైపు రేష‌న్ కార్డుల తిప్పలు. ఇంకోవైపు కరువుతో రైతన్నల ఆత్మహత్యలు. దీంతో ప్రతిప‌క్షాలకు చేతినిండా ప‌నిదొరికింది. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా సర్కారుపై విమర్శల బాణాలు ఎక్కుబెడుతున్నారు ప్రతిపక్ష నేతలు. వాటికే ప‌రిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగారు. స‌ర్కార్ అస‌మ‌ర్థతను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతామని చెబుతున్నారు.

ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు అదేపనిగా విమర్శిస్తూ ఉంటే మంత్రులెవరూ క్షేత్ర స్థాయికి వెళ్లడం లేదని సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగున్నర నెలలైనా మంత్రులు తమ శాఖల మీద పట్టు సాధించడం లేదంటూ ఒకరిద్దరూ మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడంలో విఫలం అవుతున్నారనే భావనను కేసీఆర్ వ్యక్తం చేసినట్లుగా చర్చించుకుంటున్నారు. మంత్రివర్గంలోని ముగ్గురో, నలుగురో అవకాశం ఉన్నప్పుడల్లా విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారే తప్ప మిగతా వారెవరూ ప్రతిపక్షాల విమర్శల దాడిని సరైన రీతిలో ఎదుర్కోవడం లేదంటూ టీఆర్ఎస్ అధినేత గుర్రుగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఆయా శాఖలపై ప్రతిపక్షాలు కౌంటర్లు విసిరితే, వాటికి వెంటనే రివర్స్ కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

మంత్రుల ప‌నివిధానంలో మార్పు రాన‌ట్లైతే కేబినెట్ విస్తరణలో వేటు త‌ప్పదనే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇక అధికారం చేపట్టిన మంత్రులు ఎలా స్పందిస్తారోన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.