ఆ ఒక్క sms కీర్తిని ఏడిపించేసిందట

Wednesday, May 9th, 2018, 04:00:22 PM IST

ప్రతిష్టాత్మక వైజయంతి ప్రొడక్షన్ లో నిర్మించిన సావిత్రి బయోపిక్ మహానటి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ తో కలిసి సావిత్రి కుటుంబ సభ్యులు సినిమాను చూశారు. అయితే సావిత్రి కుమారుడు కూతురు ఈ సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సినిమా చుసిన అనంతరం కంట తడి పెట్టుకోకుండా ఉండలేకపోయారట.

సినిమా షూటింగ్ సమయంలోనే విజయ గారు కీర్తి సురేష్ ని చూసి ఎంతగానో భావోద్వేగానికి లోనయ్యారట. దాదాపు ప్రతి కీలక సన్నివేశాల్లో ఆమెను పక్కన ఉంచుకొనే చిత్ర యూనిట్ సినిమాను తెరకెక్కించింది. ఇకపోతే రీసెంట్ గా సినిమా చూసిన తరువాత కూడా కీర్తి సురేష్ తో విజయ చాలా ఎమోషనల్ గా మాట్లాడారట. ఇక ఆ తరువాత విజయ చాముండేశ్వరి ప్రేమతో చేసిన ఒక మెస్సేజ్ కి కీర్తి ఎంతగానో సంతోషించిందట.

“నా తల్లి యొక్క వెచ్చదనం ఎప్పుడైనా అవసరమైతే – నేను మీ దగ్గరకు వస్తాను” అని ఆమె SMS ద్వారా చెప్పడంతో కీర్తి మనస్సు ఒక్కసారిగా కదిలిందట. గుండెలోని సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేసిందట. అలాగే చాలా సంతోషంగా ఉప్పొంగిపోయిందని మహానటి చిత్ర యూనిట్ లో ఒకరు ఈ విషయాన్ని తెలిపారు. సావిత్రి బయోపిక్ కోసమే కీర్తి పుట్టిందని సోషల్ మీడియాలో సావిత్రి అభిమానులు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిప్ లో సమంత – విజయ్ దేవరకొండ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments