నానికి ఏమైంది..పదవిని కూడా వద్దనుకున్నారు !

Wednesday, June 5th, 2019, 11:29:42 AM IST

కేశినేని నాని.. టీడీపీలోని బలమైన నేతల్లో ఒకరు. ఇప్పటికే పలుసార్లు ఆయన ప్రజాబలం ఏమిటో నిరూపణ కాగా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆయన సత్తా చాటారు. జగన్ హవాను ఎదిరించి ఎంపీగా గెలిచారు. టీడీపీ సొంతం చేసుకున్న మూడు ఎంపీ స్థానాల్లో ఈయనది కూడా ఒకటి. గెలిచినవారు తక్కువగా ఉండటంతో చంద్రబాబు పార్టీలోని కీలక పదవుల్ని వారికే అప్పగించాలని డిసైడ్ అయ్యారు.

అందులో భాగంగానే లోక్ సభలో పార్టీ విప్ పదవిని నానికి అప్పగించాలని నిర్ణయం తీసుకుని కబురు పంపారు. కానీ ఏమైందో ఏమో కానీ నాని మాత్రం ఆ పదవికి తాను అర్హుడిని కాదంటూ తిరస్కరించారు. స్వతహాగా ఎలాంటి ప్రతికూల పరిస్తితులనైనా ఎదుర్కొగలరనే పేరు నానికి ఉంది. అలాంటి ఆయన కీలక సమయంలో బాబు ఇవ్వజూసిన ముఖ్యమైన పదవిని కాదన్నారంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆ కారణం పార్టీని బలహీనపరిచేదిగా ఉండకూడదని కూడా కోరుకుంటున్నారు.