‘ఖైదీ నెం 150’ వి ఫేక్ కలెక్షన్స్ అంటూ ఫ్యాన్సుకి కోపం తెప్పించారు !

Thursday, February 16th, 2017, 06:22:31 PM IST


మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క కలెక్షన్ల విషయంలో విడుదలకు ముందు నుండి పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ వస్తున్నాయి. సాధారణంగానే కలెక్షన్ల రికార్డుల్ని మెగా అభిమానులు ప్రతిష్టామకంగా భావిస్తారు కనుక అల్లు అరవింద్ ఎప్పటికపుడు ఫ్యాన్సుకు ఆ వివరాలు ప్రకటిస్తూ వచ్చారు. అరవింద్ చెప్పిన లెక్కల ప్రకారం కలెక్షన్లు రూ. 100 కోట్లు దాటిపోయాయి.

అయితే గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టి ఇప్పటికే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిర్మాతలను ప్రశించిందని, ఇప్పుడు ‘ఖైదీ’ నిర్మాత చరణ్ పై నిఘా పెట్టి ఆయన్ను కూడా ప్రశించారని అప్పుడు చరణ్ తెలివిగా ఖైదీ కలెక్షన్లని తారుమారు చేసి బడ్జెట్ రూ. 60 కోట్లు పెట్టామని అందులో రూ.20కోట్లు తండ్రి చిరుకు, రూ. 10 కోట్లు దర్శకుడు వినాయక్ కు రెమ్యునరేషన్ ఇచ్చామని, అంతా పోను కేవలం రూ. 15కోట్లే మిగిలాయని, వాటికి చెల్లించిన పన్ను పత్రాలను చూపించి సేఫ్ అయ్యాడని ఒక ప్రముఖ పత్రిక ఈరోజు వార్తా కథనం ప్రచురించింది.

దీన్ని చూసిన అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే ఈ లెక్కల్ని పట్టుకుని వేరే హీరోల ఫ్యాన్స్ ఖైదీవీ ఫేక్ కలెక్షన్లని, ఇప్పుడు బయటికొచ్చిన లెక్కల ప్రకారం చిరు చిత్రం టాప్ 3లో కూడా లేదని కాస్త నొప్పించే విధంగా సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కాస్త తారా స్థాయికి చేరుకొని వార్త ప్రచురించిన పత్రికను ఎండగడుతూ, నొప్పించే విధంగా మాట్లాడుతున్న ఇతరులపై ఘాటైన సమాధానాలతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.